Telugu Players Sricharani and Arundhati Reddy in Women’s World Cup 2025 India Squad: భారత్ వేదికగా సెప్టెంబర్ 30న మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఆరంభం కానుంది. భారత్, శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీలో పాల్గొనే జట్టును బీసీసీఐ సెలక్టర్లు మంగళవారం ప్రకటించారు. సొంతగడ్డపై జరిగే మెగా టోర్నీకి 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించగా.. ఇద్దరు తెలుగు ప్లేయర్స్ శ్రీచరణి, అరుంధతి రెడ్డి చోటు దక్కించుకున్నారు. భారత మహిళా జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు.
ఆసియా కప్ 2025 కోసం పురుషుల జట్టును ప్రకటించిన అనంతరం.. వన్డే ప్రపంచకప్ 2025 కోసం మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. భారత మహిళల చీఫ్ సెలెక్టర్ నీతూ డేవిడ్ విలేకరుల సమావేశంలో ప్లేయర్స్ పేర్లు వినిపించారు. అలానే వన్డే ప్రపంచకప్ 2025కి ముందు సెప్టెంబర్ 14న ఆస్ట్రేలియాతో జరిగే వన్డేల సిరీస్‌కు కూడా భారత జట్టును ప్రకటించారు. ఒక మార్పు మినహా ప్రపంచకప్, ఆస్ట్రేలియా సిరీస్‌కు ఒకే జట్టు ఆడుతోంది. ప్రపంచకప్ జట్టులో అమన్ జ్యోత్ ఆడుతుండగా.. ఆస్ట్రేలియా సిరీస్‌లో సయాలి సత్గారె ఆడనుంది.
Also Read: Tirumala: శ్రీవారికి 121 కేజీల బంగారం విరాళం.. ఆజ్ఞాత భక్తుడి కండిషన్ ఏంటో చెప్పిన సీఎం!
లేడీ సెహ్వాగ్, స్టార్ ఓపెనర్ షెఫాలి వర్మకు షాక్ తగిలింది. వన్డే ప్రపంచకప్ సహా ఆస్ట్రేలియా సిరీస్‌కు సైతం ఎంపిక కాలేదు. ఇటీవలి కాలంలో సత్తా చాటిన ప్రతీక రావల్‌పై బీసీసీఐ సెలక్టర్లు నమ్మకముంచారు. పేసర్ రేణుక సింగ్ భారత జట్టులో పునరాగమనం చేసింది. మరో పేసర్ క్రాంతి గౌడ్ జట్టులో స్థానం సంపాదించింది. శ్రీచరణి, దీప్తి శర్మ, రాధ యాదవ్, స్నేహ్ రాణాలతో స్పిన్ విభాగం బలంగా ఉంది. హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, యాస్తిక భాటియాలతో బ్యాటింగ్ కూడా బాగుంది. ఈసారి తప్పక ఐసీసీ టోర్నీ గెలుస్తామని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై టోర్నీ జరుగుతుండడం మనకు కలిసొచ్చే అంశం.
భారత జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), శ్రీచరణి, అరుంధతి రెడ్డి, హర్లీన్ డియోల్, ప్రతీక రావల్, దీప్తిశర్మ, జెమీమా రోడ్రిగ్స్, రేణుక సింగ్, రిచా ఘోష్, క్రాంతి గౌడ్, అమన్‌జ్యోత్ కౌర్, రాధ యాదవ్, యాస్తిక భాటియా, స్నేహ్ రాణా.