Women’s T20 World Cup 2026 టైటిల్‌ గెలిచే సత్తా ఉందా.? హర్మన్‌ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!

Women's T20 World Cup 2026

Women's T20 World Cup 2026

Women’s T20 World Cup 2026: ఈ ఏడాది ఆరంభంలో చారిత్రాత్మకంగా మహిళల వన్డే ప్రపంచకప్‌ 2026ను గెలుచుకున్న భారత మహిళల జట్టు ఇప్పుడు మరో ఐసీసీ ట్రోఫీపై కన్నేసింది. ఇంగ్లండ్, వేల్స్ వేదికగా జరగనున్న 2026 మహిళల టీ20 ప్రపంచకప్‌ లో హర్మన్‌ ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా మొదటి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. భారత్ ఈ ప్రతిష్టాత్మక సిరీస్ లో జూన్ 14న ఎడ్జ్‌బాస్టన్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ తో జరిగే మ్యాచ్‌తో మొదలు కానుంది. ఆ తర్వాత నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లతో గ్రూప్ స్టేజెస్ లో తలపడనుంది.

భారత్ బలం:

భారత్ ప్రధాన బలం బ్యాటింగ్ విభాగమే. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు తోడుగా స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉండనే ఉన్నారు. ముఖ్యంగా చివరి ఓవర్లలో వేగంగా పరుగులు రాబట్టగల రిచా ఘోష్‌కు తోడుగా భర్తి ఫుల్మాలి, దీప్తి శర్మ ఉండటం భారత్‌కు మరింత బలం కానుంది. ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్న భర్తి ఫుల్మాలి ప్రత్యర్థి బౌలర్లకు సవాల్ విసిరే సామర్థ్యం కలిగి ఉంది.

×
×
Ad

మరోవైపు భారత్ స్పిన్ దళం ఈ టోర్నీలో కీలక పాత్ర పోషించనుంది. శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, శ్రీ చరణి ప్రధాన స్పిన్నర్లుగా ఉండగా.. అనుభవజ్ఞురాలైన దీప్తి శర్మ కూడా స్పిన్ విభాగాన్నీ ముందుండి నడిపించనుంది. ఇంగ్లండ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత జట్టు స్పిన్ విభాగాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేసింది. మధ్య ఓవర్లలో వికెట్లు తీసే సామర్థ్యం ఈ బౌలర్ల ప్రత్యేకతగా చెప్పవచ్చు.

15 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో అనుభవం, యువశక్తి సమతూకంగా కనిపిస్తోంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ద్వారా వెలుగులోకి వచ్చిన పలువురు ఆటగాళ్లు ఇప్పుడు ప్రపంచకప్ వేదికపై తమ ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఈ మధ్యనే WPL భారత మహిళా క్రికెట్‌కు ఆడే కొత్త తరం ఆటగాళ్లను అందించిందని పలుమార్లు చెప్పకనే చెప్పింది.

బలహీనతలు:

భర్తి ఫుల్మాలి, నందిని శర్మ, శ్రీ చరణి, క్రాంతి గౌడ్‌లకు ఇది తొలి మహిళల టీ20 ప్రపంచకప్. అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి పెద్ద టోర్నీలో ఆడే అనుభవం లేకపోవడం భారత్‌ కు కాసింత ఆందోళన కలిగించే అంశంగా మారింది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్, లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ విభాగాల్లో అనుభవజ్ఞులైన ఆటగాళ్లపై ఎక్కువ బాధ్యత పడనుంది. భారత్ వన్డే ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ అమంజోత్ కౌర్ గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమైంది. వెన్ను గాయం కారణంగా ఆమె ఐదు నెలలపాటు క్రికెట్‌కు దూరంగా ఉండనుంది. అమంజోత్ స్థానాన్ని భర్తీ చేస్తుందని భావించిన కాశ్వీ గౌతమ్ కూడా మోకాలి గాయం కారణంగా టోర్నీకి దూరమైంది. దీంతో జట్టులో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది.

ఏళ్ల తరబడి ఐసీసీ టోర్నీల్లో నిరాశలు ఎదుర్కొన్న భారత్.. ఈ ఏడాది మొదట్లో వన్డే ప్రపంచకప్ గెలిచి ఆ లోటును తీర్చుకుంది. ఇప్పుడు అదే జోరును కొనసాగిస్తూ వరుసగా రెండో ఐసీసీ టైటిల్ సాధించే అవకాశం భారత మహిళల ముందుంది. సమతూకంతో కూడిన జట్టు, మంచి ఫామ్‌లో ఉన్న కీలక ఆటగాళ్లు, యువ ప్రతిభ కలయిక భారత్‌కు ఈసారి మంచి అవకాశాలను కల్పిస్తోంది. భారత్‌ కు ప్రధాన సమస్య పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల కొరత. అమంజోత్ కౌర్, కాశ్వీ గౌతమ్ లేకపోవడంతో బ్యాటింగ్‌కు తోడ్పాటు అందించే సీమర్లు జట్టులో దాదాపు లేరు. దీంతో అరుంధతి రెడ్డిపై భారీగా భారం పడనుంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ ఆమె నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది. టోర్నీలో భారత్ విజయావకాశాలు ఆమె ప్రదర్శనపై కూడా ఆధారపడి ఉండొచ్చు.

భారత్ బెస్ట్ ప్లేయింగ్ XI (అంచనా):

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భర్తి ఫుల్మాలి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్, శ్రేయాంక పాటిల్/రాధా యాదవ్.