Andhra Cricket Association: ఏపీ మహిళా క్రీడాకారులకు శుభవార్త.. సెప్టెంబర్ 15 నుంచే ప్రారంభం..

Mithali Raj

Mithali Raj

ఆంధ్రప్రదేశ్ క్రికెట్ రంగంలో మహిళా క్రీడాకారులకు కొత్త ఊపిరి పోస్తూ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు కేశినేని శివనాథ్ నేతృత్వంలో ఉమెన్స్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (WPL) నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఇటీవల మెన్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ విజయవంతం కావడంతో, మహిళా క్రికెట్‌కు ప్రాముఖ్యతనిస్తూ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ కొత్త లీగ్‌ను అధికారికంగా ప్రకటించారు.

ఈ టోర్నమెంట్ భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఆధ్వర్యంలో జరగనుంది. సెప్టెంబర్ 15 నుండి 26 వరకు మంగళగిరి మైదానంలో డే-నైట్ మ్యాచ్‌లుగా ఈ టోర్నీ సాగుతుంది. ఈ లీగ్ కోసం నాలుగు ఫ్రాంచైజీ జట్లను వేలం ద్వారా ఎంపిక చేశారు. వేలంలో ప్రారంభ ధర రూ. 35 లక్షలుగా నిర్ణయించగా, అత్యధికంగా ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ రూ. 89 లక్షలకు ఒక జట్టును దక్కించుకుంది. మిగిలిన మూడు జట్లను వరుసగా రూ. 88.50 లక్షలు, రూ. 77.77 లక్షలు, మరియు రూ. 61.11 లక్షలకు యాజమాన్యాలు కొనుగోలు చేశాయి. మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు ఈ మ్యాచ్‌లకు పాఠశాల విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. 4 జట్లతో ప్రారంభమవుతున్న ఈ లీగ్‌ను భవిష్యత్తులో మరిన్ని జట్లతో విస్తరించడంతో పాటు, మూలపాడు వద్ద త్వరలోనే ఒక ప్రత్యేక క్రికెట్ అకాడమీని ప్రారంభించనున్నట్లు ఏసీఏ తెలిపింది.

ఏసీఏతో గత 2-3 ఏళ్లుగా అనుబంధం ఉన్న మిథాలీ రాజ్ ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఏసీఏ నుంచి స్నేహ్ దీప్తి వంటి ఆటగాళ్లు భారత్‌కు ప్రాతినిధ్యం వహించారని గుర్తుచేశారు. జాతీయ స్థాయిలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిందో, ఈ ప్రాంతీయ లీగ్ కూడా ఆ స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వేలం విధానం ద్వారా మహిళా క్రికెట్‌కు ప్రాముఖ్యత, ఆర్థిక విలువ, విజిబిలిటీ పెరుగుతాయని పేర్కొన్నారు.

ఈ లీగ్ ద్వారా జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, విభిన్న కేటగిరీల ప్లేయర్లకు ప్రొఫెషనల్ స్థాయి ఎక్స్‌పోజర్ లభిస్తుందని వివరించారు. ఫ్రాంచైజీలు కూడా రూరల్ టాలెంట్‌ను గుర్తించే బాధ్యతను తీసుకుంటుండటం విశేషం. ఏసీఏ చేపట్టిన ఈ ప్రొఫెషనల్ చొరవ వల్ల భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ నుంచి మరిన్ని కొత్త తారలు భారత జాతీయ జట్టుతో పాటు WPLలో మెరిసే అవకాశం ఉందని మిథాలీ రాజ్ ధీమా వ్యక్తం చేశారు.