మహిళా సాధికారతకు అత్యంత కీలకమైన మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోవడం దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నాయని ఆరోపిస్తూ, ఎన్డీయే (NDA) కూటమి దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రతిపక్షాల తీరును నిరసిస్తూ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు ఎన్డీయే పక్షాలు సిద్ధమయ్యాయి.
లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందకపోవడంతో, కేంద్ర మంత్రులు , ఎన్డీయే కూటమి అగ్రనేతలు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్, అర్జున్ రామ్ మేఘ్వాల్ సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం కేంద్రం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంటే, ప్రతిపక్షాలు కావాలనే అడ్డుపడ్డాయని, దీనిపై ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని ఈ సమావేశంలో నిర్ణయించారు.
మహిళా సాధికారతకు అడ్డుపడుతున్న ప్రతిపక్షాల చర్యను ఎండగట్టాలని ఎన్డీయే నిర్ణయించింది. ఇందులో భాగంగానే నేడు దేశంలోని అన్ని ప్రధాన పట్టణాలు , జిల్లా కేంద్రాల్లో భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌ను ప్రతిపక్షాలు ఏ విధంగా కాలరాశాయో ప్రజలకు వివరిస్తూ ఎన్డీయే నేతలు ఈ ఆందోళనల్లో పాల్గొననున్నారు.
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఇవాళ్టి నుంచే జులై నెల దర్శన టికెట్ల విడుదల
ఈ నిరసనల ద్వారా మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకోవడంతో పాటు, ప్రతిపక్ష పార్టీలను మహిళా వ్యతిరేకులుగా చిత్రించేలా ఎన్డీయే వ్యూహరచన చేస్తోంది. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రతిపక్షాల వైఖరిని ఎండగడుతూ ఎన్డీయే చేస్తున్న ఈ పోరాటం రాజకీయంగా ఎటువంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
