TGSRTC Strike: తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. బుధవారం ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయాయి. డిపోల్లో బస్సులు ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇదే అదునుగా ప్రైవేట్ వాహనదారులు రెచ్చిపోయారు. అయితే.. ఈ రోజు(గురువారం) బస్సులు నడుస్తాయా లేదా? అనే అంశాన్ని ఇప్పుడు చూద్దాం.. ఆర్టీసీ జేఏసీ ఈరోజు మహా ధర్నాకు పిలుపునిచ్చింది. గురువారం ఉదయం 5 గంటలకు కార్మికులు అన్ని బస్ డిపోలు, వర్క్‌షాప్‌లకు చేరుకోవాలని జేఏసీ ఛైర్మన్ ఈదురు వెంకన్న కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీతో చర్చలు జరిపినట్లు తెలిపారు. 32 డిమాండ్లపై జరిగిన సుదీర్ఘ చర్చలు ఫలించలేదని స్పష్టం చేశారు. ప్రధాన సమస్యల పరిష్కారంపై ఎలాంటి స్పందన లేదని చెప్పారు. 30 శాతం ఫిట్‌మెంట్ తగ్గకుండా 2021 వేతన సవర చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎలక్ట్రిక్ బస్సులను సైతం రద్దు చేయాలని డిమాండ్‌ను లేవనెత్తారు. కొంత మంది ఉద్యోగులను ఇతర జోన్లకు బదిలీ చేశారని, ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ ప్రధాన డిమాండ్లు పరిష్కరిస్తేనే సమ్మె విరమిస్తామని స్పష్టం చేశారు.
ఇక మరోవైపు.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కార్మికులకు సంస్థ ఎండీ నాగిరెడ్డి కీలక సూచనలు చేశారు. కార్మికులు ఎవరూ మాయ మాటలు నమ్మి సమ్మెకు వెళ్లవద్దని, అనాలోచిత నిర్ణయాలతో తమ ఉద్యోగ భవిష్యత్తును ప్రమాదంలో పడేసుకోవద్దన్నారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యం ఇప్పటికే సానుకూలంగా స్పందించిందని తెలిపారు. అందులో భాగంగానే ఐఏఎస్ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని సైతం ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం లేబర్ కమిషనర్ వద్ద చర్చలు కొనసాగుతున్న తరుణంలో సమ్మె కొనసాగించడం చట్టరీత్యా చెల్లదని చెప్పారు. ఇది పూర్తిగా నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టం చేశారు.
