Prashant Kishor: భారత రాజకీయాల్లో ఆధునిక చాణక్యుడిగా కీర్తిగడించిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ఒకప్పుడు ఆయన ఏ పార్టీకి రాజకీయ సలహాదారుగా ఉంటే ఆ పార్టీ విజయం సాధించడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అలాంటి ప్రశాంత్ కిషోర్ తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటే ఆయనకు చేదు ఫలితం ఎదురైంది.2022లో ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీ (JSP) పార్టీని స్థాపించి తాజా బీహార్‌లో ఎన్నికల్లో పోటీ చేశారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ 0-5 సీట్లు గెలుస్తాయని అంచనా వేశాయి కానీ ఆయన పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. ఇదే సమయంలో ఆయన పార్టీ అధికార పార్టీ ఓట్లను గణనీయంగా తగ్గిస్తుందని వచ్చిన అంచనాలు కూడా నిజం కాలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పీకే ఓటమికి కారణాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Minister Vakiti Srihari : మా పాలనపై నమ్మకంతోనే ప్రజలు ఓటు వేశారు !
పీకే మాటమీద నిలబడతాడా..
బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రశాంత్ కిషోర్ ఒక జాతీయ టీవీ జర్నలిస్టుతో మాట్లాడుతూ.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్ యునైటెడ్ 25 సీట్లకు మించి గెలవదని అన్నారు. అలా జరగకపోతే తాను పదవీ విరమణ చేస్తానని పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా ఆ జర్నలిస్ట్ మళ్లీ ప్రశాంత్ కిషోర్‌ను అడిగినప్పుడు.. ఆయన మాట్లాడుతూ.. “ఈ రికార్డింగ్ ను ఉంచుకోండి. జేడీయూ 25 సీట్లకు పైగా గెలిస్తే, నేను రాజకీయాల నుంచి పదవీ విరమణ చేస్తాను” అని అన్నారు. వాస్తవానికి పీకే ఎన్నికల ముందు తన మాటలపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు ఆయన తన మాటల మీద ఎంత వరకు నిలబడతాడు అనేది తెలియాల్సి ఉంది.
జన్‌సురాజ్ పార్టీ ఓటమికి కారణాలు..
* ఈ ఎన్నికల్లో జన్‌సురాజ్ పార్టీ వైఫల్యానికి అతిపెద్ద కారణం ప్రశాంత్ కిషోర్ తేజస్వి యాదవ్‌ను సవాలు చేసి, ఆ తర్వాత వెనక్కి తగ్గడమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటన తర్వాత ప్రజలు పీకేని వ్యాపారవేత్తగా చూడటం ప్రారంభించారని చెబుతున్నారు. “బీహార్‌కు కొత్త సూర్యుడిని తీసుకువస్తానని” చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. ఆ ప్రకటనకు తనను తాను ప్రత్యామ్నాయ నాయకుడిగా స్థాపించుకునే సువర్ణావకాశాన్ని కోల్పోయాడని పేర్కొన్నారు.
* వాస్తవానికి ఈ ఎన్నికల ప్రచారంలో ప్రశాంత్ కిషోర్.. తన ప్రసంగాల్లో నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి కేంద్ర నాయకులను నేరుగా లక్ష్యంగా చేసుకోవడం మానుకున్నారు. ఒక వైపు ప్రతి ప్రతిపక్ష నాయకులు మోడీ-షాలపై విమర్శలు గుప్పిస్తుంటే ఆయన మాత్రం బీజేపీ బి-టీమ్‌గా వ్యవహరిస్తున్నారని ప్రజలు భావించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి ప్రశాంత్ కిషోర్ .. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వాన్ని అనుసరించి ప్రతి సమస్యకు షా మోడీని నిందించి ఉండాలని, ఎందుకంటే ఎన్నికల్లో ఈ వ్యూహం కొంత మంచి ఫలితాలను ఇచ్చి ఉండవచ్చని పేర్కొన్నారు.
* ప్రశాంత్ కిషోర్ బీజేపీ నాయకుడు సామ్రాట్ చౌదరి (ఉప ముఖ్యమంత్రి), జేడీయూ నాయకుడు అశోక్ చౌదరి (మంత్రి) సహా ప్రముఖ ఎన్డీఏ నాయకులపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. అయితే ఆయన తన ఆరోపణలను విలేకరుల సమావేశానికే పరిమితం చేశారు. వాస్తవానికి ఆయన సానుకూల రాజకీయాలపై మాత్రమే తన దృష్టిని కేంద్రీకరించారు. అభివృద్ధి, విద్య, ఆరోగ్యం గురించి ప్రజలలో చర్చించినంత తీవ్రతతో అవినీతి అంశాన్ని కూడా లేవనెత్తి ఉంటే, బహుశా ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉండేవని చెబుతున్నారు.
* కుల రాజకీయాలకు పాల్పడబోమని హామీ ఇచ్చి, కులం, మతం పేరుతో టిక్కెట్లు ఇచ్చారనే విమర్శ ఆయనపై ఉంది. ప్రశాంత్ కిషోర్ తాను కుల రాజకీయాల్లో పాల్గొనని చెప్పుకున్నాడు, కానీ ఆయన దానికి పూర్తిగా విరుద్ధంగా వ్యవహరించాడు. టిక్కెట్లు పంపిణీ చేసేటప్పుడు కులం, మతం ఆధారంగా అభ్యర్థులను వ్యక్తిగతంగా ఎంపిక చేశారనే విమర్శలు ఉన్నాయి. 2022లో JSP ని ప్రారంభించినప్పుడు, ఆయన తన పార్టీ “పారదర్శకత, అభివృద్ధి, కులరహిత రాజకీయాలకు” చిహ్నంగా ఉంటుందని పేర్కొన్నారు. కానీ ఎన్నికల్లో ఆయన తన మాటలను ఆచరణలో చూపించలేకపోయారనే విమర్శలు మూటగట్టుకున్నారు.
READ ALSO: Bihar Elections: అధికారాన్ని దూరం చేసిన అన్నదమ్ముల లొల్లి.. ఆర్జేడీని ముంచిన కుటుంబ కలహాలు!
