పేరుకే రిసార్ట్…!! అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా !! టూరిస్ట్‌ల పాలిట మృత్యుకుహరం ! లేక్ వ్యూ రిసార్ట్ కాదు… లేక్‌లోనే కట్టిన రిసార్ట్ ! ఇరిగేషన్ భూములను అక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణం… అనుమతుల్లేకుండా బోటింగ్ నిర్వహించి ఇద్దరు టూరిస్ట్‌ల ప్రాణాలు బలిగొంది ఆ రిసార్ట్ ! ఈ ఘటనతో వికారాబాద్‌లోని వైల్డర్‌నెస్ రిసార్ట్ బాగోతాలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
వీకెండ్ కదా అని సరదాగా గడిపేందుకు వెళ్తే… ఇద్దరి ప్రాణం బలిగొంది ఆ రిసార్ట్. అనంతగిరి కొండల సాక్షిగా ఇద్దరి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఆహ్లాదం కోసం వెళితే.. ఆ ఇద్దరి కుటుంబాలో తీవ్ర విషాదం నింపింది. అనుమతులు లేవు… సేఫ్టీ మెజర్‌మెంట్స్ అసలే లేవు.. దీంతో బోటింగ్‌కి వెళ్లిన ఇద్దరు మహిళలు నీటమునిగి చనిపోయారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది…
ఇది వికారాబాద్ పరిధిలోని సర్పన్‌పల్లిలో ఉన్న వైల్డర్‌నెస్ రిసార్ట్! పేరుకు తగ్గట్టే యమ వైల్డ్. ఈ రిసార్ట్‌లోనే బోటింగ్‌కి వెళ్లి చనిపోయారు ఇద్దరు మహిళలు. చూస్తున్నారు కద్దా… రిసార్ట్‌ను ఏకంగా చెరువులో నిర్మించారు. లేక్ ఫ్రంట్ అని ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు కానీ… ఏకంగా లేక్ బార్డర్‌ను దాటి లేక్‌లోనే చేపట్టిన నిర్మాణం ఇది. ఇరిగేషన్ భూములను ఆక్రమించి ఎలాంటి అనుమతులు లేకుండా కట్టిన అక్రమ నిర్మాణం.
నిజానికి ఈ వైల్డర్‌నెస్ రిసార్ట్‌కి అనుమతి లేదు. అందులో బోటింగ్‌కి అసలే అనుమతి లేదు. ఆల్కాహాల్‌కి పర్మిషన్ లేదు…! ఇవేం తెలియక చెరువు చెంతనే ఉంది కదా అని ఎగేసుకుని వచ్చేస్తున్నారు అమాయక టూరిస్ట్‌లు. ఎంజాయ్‌మెంట్ కోసం వచ్చే యువకులకు ఏకంగా హుక్కా కూడా సప్లై చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ అనుమతి లేకుండానే లిక్కర్ అందిస్తున్నారు. కొన్ని అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నట్లు గుర్తించారు అధికారులు.
ఫిర్యాదులు అంది ఎవరైనా అధికారులు అక్కడికి వెళ్లినా… అధికారులపైకి కుక్కలను ఉసిగొల్పుతున్నారు రిసార్ట్ నిర్వాహకులు. అమెరికన్ పిట్‌బుల్ లాంటి డేంజరస్ డాగ్స్‌ను 10 కి పైగా రిసార్ట్ నిర్వాహకులు పెంచుతున్నారు. మీడియా వెళ్లినా… అధికారులు వెళ్లినా… కుక్కలను పైకి వదులుతున్నారు.
ఇరిగేషన్ భూములను కబ్జా పెట్టిన ఓ బడాబాబు.. ఏకంగా 8 ఎకరాల్లో అక్రమంగా రిసార్ట్‌ను నిర్మించాడు. అధికారులకు నెలనెలా మామూళ్లు పంపుతూ… రిసార్ట్ బాగోతం బయటపడకుండా మ్యానేజ్ చేస్తున్నాడు. బోటింగ్ పేరుతో కాలం చెల్లిన బోట్లను పెట్టి టూరిస్ట్‌ల ప్రాణాలను బలిగొంటున్నారు రిసార్ట్ నిర్వాహకులు. బోటింగ్‌లో షికారుకు వెళ్తున్న వారికి లైఫ్ జాకెట్లు కూడా ఇవ్వడం లేదు. నిన్న ఇదే తరహాలో బోటింగ్‌కి వెళ్లిన ఇద్దరు మహిళలు బోటు బోల్తా పడి నీట మునిగి చనిపోయారు.
Also Read: Falcon App Scam: ఏం స్కెచ్చేశారు మామ.. చిన్న యాప్‌తో 4 వేల కోట్ల రూపాయలు కొట్టేశారుగా!
వీకెండ్ కావడంతో… హైదరాబాద్ నుంచి ఓ టూరిస్ట్ ఫ్యామిలీ సరదాగా అనంతగిరి వెళ్లారు. ఆహ్లాదంగా గడిపి అక్కడి నుంచి సర్పన్‌పల్లిలో ఉన్న వైల్డర్‌నెస్ రిసార్ట్ చేరుకున్నారు విజయ్, రీతా కుమారి, అజిత్ కుమార్, పూనమ్ సింగ్ దంపతులు. వీరితోపాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బోటింగ్ కూడా ఉండటంతో… సాయంత్రం ఇద్దరు చిన్నారులతో సహా రీతా కుమారి, పూనమ్ సింగ్ బోటింగ్‌కి వెళ్లారు. విజయ్, అజిత్ కుమార్ ఒడ్డు వద్దే ఉన్నారు. బోటింగ్‌కి వెళ్లిన సమయంలోనే భారీ వర్షం కురవడంతో బోట్‌ను వెనక్కి తిప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా బోల్తా పడింది బోట్. గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు. అలోక్ కుమార్ అనే వ్యక్తి ఇద్దరు చిన్నారులను సురక్షితంగా కాపాడాడు. మహిళలను కాపాడే ప్రయత్నం చేస్తూ.. నీట మునిగాడు. వెంటనే స్థానికులు కాపాడారు. ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. రీతా కుమారి, పూనమ్ సింగ్ ఇద్దరూ చనిపోయారు.
లైఫ్ జాకెట్లు ఉండే ఈ ఇద్దరూ సురక్షితంగా బతికిబట్టకట్టే వారు. కాలం చెల్లిన బోటు… ఎలాంటి అనుభవం లేని వ్యక్తి బోటు నడపటం.. లైఫ్ జాకెట్లు లేకపోవడం.. వల్లే ఇద్దరు మహిళలు చనిపోయారు. రిసార్ట్‌లో సోదాలు చేసిన పోలీసులు.. హుక్కా పాట్స్, మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మృతి.. అక్రమ నిర్మాణం.. అనుమతులు లేకపోవడంపై కేసులు నమోదు చేశారు.
