NTV Telugu Site icon

Off The Record: సీఎం జగన్ తో ఆ మాజీ మంత్రి మీట్ అయ్యేది అందుకేనా…?

Off The Record: ప్రకాశం జిల్లాలో వైసీపీ మీద గట్టి పట్టున్న నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి… రెండు పర్యాయాలు మంత్రిగా కూడా పనిచేశారాయన. అయితే గత మంత్రివర్గ విస్తరణ సమయం నుంచి జరుగుతున్న పరిణమాలు ఆయనను అంతర్మధనంలో పడేశాయి. సొంత వాళ్లే గోతులు తీస్తున్నారంటూ విరక్తితో సైలెంటై పోయారు. అయితే… ఇటీవల పర్యటనకు వచ్చిన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి జిల్లాలో ఇక నుంచి అంతా బాలినేని చేతుల మీదుగానే నడుస్తుందని చెప్పి వెళ్లారు. కానీ.. ఇటీవల బయటపడ్డ ఫేక్ డాక్యుమెంట్స్ స్కాం దర్యాప్తులో జరుగుతున్న పరిణామాలు ఆయనకు మరోసారి కోపం తెప్పించాయట. వైసీపీ నేత చుండూరి రవి కొన్న ఓ భూమిని తమదేనంటూ కొందరు రావటం.. అక్కడ కట్టిన కాంపౌండ్‌ వాల్‌ని కూలగొట్టడంతో విషయం బాలినేని దృష్టికి వెళ్ళింది. ఇదే తరహాలో ఒంగోలులో చాలా భూముల్ని ఆక్రమిస్తున్నారని బాలినేని దృష్టికి వెళ్ళడంతో… జిల్లా పోలీస్ అధికారులతో మాట్లాడారాయన.ఒంగోలు భూ కబ్జాలపై కఠినంగా వ్యవహరించాలని, సిట్ ను ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరటంతో అధికారులు కూడా అలాగే చేశారు.

Also Read: Story Board: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపెవరిది? పోలింగ్ ముందు పార్టీల సమీకరణాలు మారతాయా?

అయితే.. ఈ కేసులో ఓ ముఖ్య వ్యక్తిని అరెస్టు చేశాక కొత్త కొత్త విషయాలు వెలుగు చూశాయట. కొందరు వైసీపీ నేతలు ఈ స్కాంలో ఇన్ వాల్వ్ అయ్యారని మాజీ మంత్రి దృష్టికి రావటంతో వాళ్ళు సొంత పార్టీ వాళ్ళు అయినా సరే… వదిలి పెట్టవద్దంటూ కలెక్టర్, ఎస్పీలకు సూచించారు బాలినేని. అదే సమయంలో ప్రతిపక్షాలు ఈ వ్యవహారాన్ని తనకు ముడిపెట్టి ఆరోపణలు చేయడం, దర్యాప్తులో ఆలస్యం జరగడం బాలినేనికి కోపం తెప్పించాయట. వ్యవహారంలో వైసీపీతో పాటు టీడీపీ నేతలు కలిసి ఉన్నా… టార్గెట్‌ మాత్రం తానే అవడంపై అసహనానికి గురైన మాజీ మంత్రి అందర్నీ ఒకేసారి అరెస్ట్‌ చేయమని సూచించారట. అదే సమయంలో కేసులో ఉన్న ఒకరిద్దరు ముఖ్యులను తప్పించేందుకు ఓ నేత రంగంలోకి దిగినట్టు తెలిసింది. ఆయన గట్టిగానే ప్రయత్నించడంతో.. పోలీసులు ముందు నలుగుర్ని, తర్వాత ముగ్గుర్ని అరెస్ట్‌ చేశారు. అందర్నీ ఒకేసారి అరెస్ట్‌ చేయమన్న తమన ఆదేశాలను పోలీసులు పాటించక పోవడంపై ఆగ్రహం చెందిన బాలినేని….తనకు కేటాయించిన గన్ మెన్‌ను సరెండర్ చేస్తున్నట్లు ప్రకటించేశారు.

Also Read: IND vs BAN: భారత్‌ భయపెడుతోంది.. అయినా మా రికార్డు మెరుగ్గా ఉంది: బంగ్లాదేశ్‌ కోచ్‌

భూ దందా కేసులో జిల్లాకు చెందిన ఆ ముఖ్య నేత జోక్యాన్ని ఇక సహించేది లేదని చెప్పడానికే ఇలా గన్ మెన్‌ను సరెండర్ చేసినట్టు తెలిసింది. తరచూ ఒంగోలు వ్యవహారాల్లో వేలు పెడుతూ.. ఆనేత తన ప్రతిష్టకు భంగం కలిగించేలా కధ నడుపుతున్నారని రగిలిపోతున్నారట వాసు. ఈ వ్యవహారంపై స్పందించిన జిల్లా ఎస్పీ సైతం ఈ కేసులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైతే తాము ఏమీ చేయలేమని అనడంతో ఏదో జరుగుతోందన్న అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. దీంతో వరుసగా జరుగుతున్న పరిణామాలను సీఎం జగన్ దృష్టికి తీసుకు వెళ్లేందుకు సిద్దమయ్యారట బాలినేని. ఒంగోలు నకిలీ డాక్యుమెంట్స్‌ స్కాంతో పాటు పలు రాజకీయ అంశాలను కూడా మాట్లాడేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. ఆ తర్వాతైనా ఒంగోలు బంధువుల వార్‌కు తెరపడుతుందా లేదా అన్నది చూడాలి