Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

తిరుమలలో నేడు రెండో రోజు ధార్మిక సదస్సును నిర్వహిస్తారు. ఈ సదస్సుకు 32 మంది స్వామీజీలు హాజరుకానున్నారు. సనాతన ధర్మంలో భాగంగా ఆధ్యాత్మిక భావ‌వ్యాప్తి కోసం ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. పీఠాధిపతులు, మాఠాథిపతుల సూచనలు, సలహాలను తీసుకొని హిందూ ధర్మప్రచారం చేయనున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. దీని ద్వారా శ్రీ‌వారి వైభ‌వాన్ని, హైందవ సంస్కృతిని వ్యాప్తి చేసేందుకు తిరుమల ఓ మంచి వేదిక కాబోతుందని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు టీడీపీ వేద సదస్సును నిర్వహిస్తోంది.

నేడు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీలో చేరనున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకోనున్నారు. పవన్‌ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారన్న నమ్మకం తనకు ఉందని, తనతో పాటు జనసేనలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారన్నారని శనివారం మీడియాతో బాలశౌరి అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నది పవన్‌ నిర్ణయిస్తారని ఆయన చెప్పారు.

నేడు కేంద్రమంత్రి అర్జున్ ముండా విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. గిరిజన సంస్కృతిక యాత్ర ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం సహకారంతో ఆంధ్రప్రదేశ్ వనవాసీ కళ్యాణ ఆశ్రమం తూర్పు కనుమల గిరిజన సంస్కృతిక యాత్ర ఫిబ్రవరి 4వ తేదీన విశాఖపట్నంలో ముగియనుంది.

నేడు జీవీఎంసీ ఎదుట ఉపాధ్యాయులు సాగర సంగ్రామ దీక్ష చేపట్టనున్నారు. ఓట్ ఫర్ ఓపీఎస్ నిదానంతో ఉపాధ్యాయుల సమావేశం జరగనుంది. పాట పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేయనున్నారు.

నేడు తెలంగాణ కెబినెట్ కీలక భేటి జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కెబినెట్ భేటి సెక్రటేరియెట్‌లో జరగనుంది. అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వాహాణపై మంత్రులు నిర్ణయించనున్నారు. అలానే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై సమావేశం జరగనుంది. ఆరు గ్యారెంటీల అమలుకు బడ్జెట్‌లో కేటాయింపులపై చర్చ జరగనుంది.

Also Read: Telangana Temperature: తెలంగాణలో పెరుగుతున్న ఎండలు.. హైదరాబాద్‌లో 1.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు!

విశాఖ వేదికగా భారత్‌, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు మూడో రోజు ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఆరంభం కానుంది. తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన టీమిండియా.. రెండో రోజు ఆట చివరికి రెండో ఇన్నింగ్స్‌లో 28/0తో నిలిచింది. యశస్వి జైస్వాల్‌ (15), రోహిత్‌ శర్మ (13) క్రీజులో ఉన్నారు. అంతకుముందు జస్ప్రీత్ బుమ్రా (6/45) బౌలింగ్‌కు తలవంచిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 55.5 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌటైంది.

Exit mobile version