NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

నేడు తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. నిజామాబాద్‌లో బీజేపీ నిర్వహించే సభకు ఇందూరు జన గర్జన సభగా నామకరణం చేశారు. 8021 కోట్ల రూపాయల ప్రాజెక్టులను శంకుస్థాపన చేసి వాటిని ఆయన జాతికి అంకితం చేయనున్నారు. రామగుండంలోని NTPCలో 6వేల కోట్ల రూపాయలతో నిర్మించిన 800 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను తెలంగాణ ప్రజలకు ప్రధాని అంకితం ఇవ్వనున్నారు. ఈ ప్లాంటులో ఉత్పత్తయ్యే విద్యుత్తులో 85 శాతం (680 మెగావాట్లు) తెలంగాణలోనే వినియోగించేలా నిర్మాణం చేశారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టైన విషయం తెలిసిందే. నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ జరుగనుంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ఈ విచారణ చేయనుంది. జాబితాలో చిట్టచివరి కేసు (63వ నెంబర్)గా చంద్రబాబు కేసు లిస్ట్ అయింది. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును చంద్రబాబు తరపు లాయర్లు ఆశ్రయించారు. గత వారంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ఎదుట చంద్రబాబు కేసు విచారణకు రాగా.. విచారణ నుంచి జస్టిస్ సరస వెంకట నారాయణ భట్టి తప్పుకున్నారు.

నేడు జగిత్యాలలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. జగిత్యాల పట్టణంలో 322.90 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. ఉదయం 8:50 గంటలకు కేటీఆర్ సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి బయలు దేరి.. 9 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం హెలిపాడ్ దగ్గర 9:45 నిమిషాలకు చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు మొదట జిల్లా కేంద్రంలో నూతనంగా 38 కోట్ల రూపాయలతో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభిస్తారు.

నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. మద్యాహ్నం 3 గంటలకు సిద్దిపేటకి రానున్న సిద్దిపేట-సికింద్రాబాద్ ప్యాసింజర్ ట్రైన్ ని జెండా ఊపి మంత్రి హరీష్ రావు ప్రారంభించనున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 3 రోజుల పాటు రాష్ట్రంలో ఈసీఐ అధికారులు పర్యటించనున్నారు. నేటి మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ఈసీఐ చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు హైదరాబాద్ చేరుకోనున్నారు. ఇప్పటికే సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్ హైదరాబాద్ చేరుకున్నారు. నేడు రాజకీయ పార్టీల నేతలు, పలు ఎన్పోర్స్మెంట్ ఏజెన్సీలు, సీఈవో, ఇతర అధికారులతో ఈసీఐ బృందం సమావేశం అవుతుంది. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ, పోలింగ్ ఏర్పాట్లపై చర్చ చేయనున్నారు.

Also Read: Yashasvi Jaiswal Fifty: నేపాల్‌తో మ్యాచ్‌.. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన యశస్వి జైస్వాల్‌!

నేడు వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో భారత్ రెండో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ఆరంభం కానుంది. ఇందుకోసం ఇరు జట్లు ఇప్పటికే తిరువనంతపురంలో అడుగుపెట్టాయి.