NTV Telugu Site icon

Trump 2.0 Cabinet: ట్రంప్ 2.0 క్యాబినెట్‌లో ఎవరెవరు..? భారత్‌ ఎలా అర్థం చేసుకోవాలి..?

What Trump 2.0 Cabinet

What Trump 2.0 Cabinet

Trump 2.0 Cabinet: డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత అతడి క్యాబినెట్ ఎలా ఉంటుందని ప్రపంచ దేశాల్లో ఆసక్తి నెలకొంది. అయితే, ప్రస్తుతం ఉన్న పరిణామాలను బట్టి చూస్తే ట్రంప్ తన క్యాబినెట్‌లో ఇండియాకు గట్టి మద్దతుదారులుగా, చైనా వ్యతిరేకులుగా ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాలు భారత్-అమెరికా మధ్య ఆశాజనక సంబంధాలను సూచిస్తున్నాయి.

మార్కో రుబియో – మైక్ వాల్ట్జ్:

జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ)గా మైక్ వాల్ట్జ్‌ని ఎంపిక చేయడం, విదేశాంగ మంత్రిగా మార్కో రుబియోని తీసుకోవడం ఇండియాకు ప్లస్ కాబోతోంది. ఈ ఇద్దరూ కూడా భారత్‌కి మంచి మద్దతుదారులు. ఫ్లోరిడా నుంచి ఎన్నికైన ఈ ఇద్దరు ఇండియాకు మంచి మిత్రులనే పేరుంది. దీంతో పాటు చైనా అంటే అస్సలు గిట్టదు. రూబియో దౌత్య అనుభవం భారతదేశానికి మంచి ఊపునిస్తుంది.

వాల్ట్జ్ ఇటీవల కెనడియన్ ప్రధాని జస్టిన్ ట్రూడోని తీవ్రంగా విమర్శించాడు. ఇటీవల కాలంలో ట్రూడో ఖలిస్తానీ అంశాన్ని ముందుకు తీసుకువచ్చి, భారత్‌ని అస్థిర పరిచే కుట్రకు పాల్పడుతున్నాడు.

రక్షణ కార్యదర్శి: పీట్ హెగ్‌సేత్

ఫాక్స్ న్యూస్ యాంకర్, ఆర్మీ నేషనల్ గార్డ్ అనుభవజ్ఞుడైన పీట్ హెగ్‌సేత్ రక్షణ కార్యదర్శిగా ఎంపికయ్యారు. హెగ్‌సెత్ సైనిక సంసిద్ధతపై కఠిన వైఖరని కలిగి ఉంటారు. రక్షణ కోసం ‘‘అమెరికా ఫస్ట్’’ విధానాన్ని కలిగి ఉన్నారు. ఇతడి అనుభవం యూఎస్ మిలిటరీ బలోపేతానికి సహకరిస్తుంది.

వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్: సూసీ వైల్స్

ట్రంప్‌ అందరికన్నా ముందు తొలి నియామకంగా వైట్‌హౌజ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా, అతడి ప్రచార నిర్వాహకురాలు సూసీ వైల్స్‌ని నియమించారు. ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా వైల్స్ చరిత్ర సృష్టించనున్నారు.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ: క్రిస్టి నోయెమ్

సౌత్ డకోటా గవర్నర్ క్రిస్టీ నోయెమ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS)కి నాయకత్వం వహించడానికి ఎంపిక చేయబడింది. ఈమె సాంప్రదాయవాదిగా పేరుంది. అమెరికా సరిహద్దుల్ని భద్రపరచడానికి, కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాన్ని అమలు చేయడానికి ట్రంప్ నిబద్ధతను ఈమె సమర్థిస్తుంది.

CIA డైరెక్టర్: జాన్ రాట్‌క్లిఫ్

నేషనల్ ఇంటెలిజెన్స్ మాజీ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్ CIA డైరెక్టర్‌గా నియమితులయ్యారు. చైనా అంటేనే రాట్‌క్లిఫ్‌కి అస్సలు గిట్టడు. గతంతో చాలా సందర్భాల్లో చైనాని విమర్శించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న చైనా శక్తిని అడ్డుకోవాలంటే భారత్‌తో సంబంధాలు మరింత బలపడాలని కోరుకుంటారు.

వైట్ హౌస్ న్యాయవాది: విలియం జోసెఫ్ మెక్‌గిన్లీ

విలియం మెక్‌గిన్లీని వైట్‌హౌస్ న్యాయవాదిగా ట్రంప్ నియమించారు. అగ్ర GOP న్యాయవాదిగా మెక్‌గిన్లీ యొక్క విస్తృతమైన అనుభవం ఉంది.

ప్రభుత్వ సమర్థత విభాగం: ఎలోన్ మస్క్ , వివేక్ రామస్వామి

ఎలాన్ మస్క్, భారతీయ అమెరికన్ బయోటెక్ వ్యవస్థాపకుడు వివేక్ రామస్వామి నేతృత్వంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) అనే కొత్త ఏజెన్సీని ఏర్పాటు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ కొత్త విభాగం ప్రభుత్వ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది, ఇది యూఎస్ , భారతీయ వ్యాపారాలకు బ్యూరోక్రాటిక్ అడ్డంకులను తగ్గిస్తుంది.

భారత్‌పై ఎలాంటి ప్రభావం..?:

రెండోసారి ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అమెరికా-భారత సంబంధాలు గణనీయమైన మార్పులకు గురయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మెరుగైన రక్షణ, భద్రతా సహకారం లభించొచ్చు. ఎన్ఎస్ఏగా మైక్ వాల్ట్జ్ నియామకం భారత్‌కి కలిసి వస్తుంది. సైనిక సహకారం, రక్షణ సాంకేతిక మెరుగుపరచడానికి దారి తీయొచ్చు. ముఖ్యంగా ఇండో-పసిఫిక్ రీజియన్‌లో చైనా ప్రభావాన్ని తగ్గించేందుకు భారత్‌తో యూఎస్ బంధం మరింత బలపడుతుంది.

మార్కో రూబియో విదేశాంగ కార్యదర్శిగా ఎంపిక కావడం భారతదేశానికి తప్పకుండా సానుకూల అంశం. రూబియో యూఎస్-భారత సంబంధాలకు మద్దతుదారుగా ఉన్నారు.

ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి ప్రభుత్వ సమర్థత విభాగం బ్రూరోక్రసీని తగ్గించడం, ప్రభుత్వ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో యూఎస్ భారత్ మధ్య సులభతర వ్యాపారం జరిగే అవకాశం ఉంటుంది.