NTV Telugu Site icon

Prabhala Theertham: ఏమిటా ప్రభల తీర్థం..? ప్రత్యేకత ఏంటి..?

Prabhala Theertham

Prabhala Theertham

Prabhala Theertham: తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ఎంతో గొప్పవి. దేశ, విదేశాలకు కూడా విస్తరించాయి.. ముఖ్యంగా పండుగలు, పర్వదినాలలో తెలుగువారి ఆచారవ్యవహారాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. మన పండుగల్లో సంక్రాంతి పండుగకు విశేషప్రాధాన్యత ఉంది. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింభించే ఈ పండుగను కోనసీమలోఎంతో ఘనంగానిర్వహిస్తారు. పండుగ వేడుకల్లో భాగంగా నిర్వహించే ప్రభలఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపుఉంది. కోనసీమవ్యాప్తంగా మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రభలతీర్థం ఎంతో అట్టహాసంగా, ఆర్భాటంగా జరుపుతారు. దాదాపు నాలుగు వందల ఏళ్లుగా కొనసాగుతున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామ జగ్గన్నతోటలో, జరిగే ప్రభలతీర్థానికి దేశ స్థాయిలో ప్రత్యేకగుర్తింపు ఉంది. ఈ తీర్థానికి తరలివచ్చే ప్రభలు ఎగువ కౌశిక దాటివస్తున్న తీరుచూసి భక్తులుగగుర్పాటుకు గురవుతారు. మకరసంక్రాంతి తర్వాత వచ్చే ఉత్తరాయణ కాలంలో ప్రభలను ఊరిపొలిమేరలు దాటిస్తే మంచిదని ప్రజల ప్రగాఢ విశ్వాసం.

కోనసీమ అంటేనే అందం. అదివేదసీమా అనిపెద్దల ఉవాచ. శ్రీశైలపర్వత సానువుల తర్వాత తొందరగా మనోలయమయ్యే ప్రదేశాలు కోనసీమ దైవక్షేత్రాలు. కోనసీమ నడుమ తరతరాల నుండి జరుగుతున్న “జగ్గన్నతోట” ప్రభలతీర్థం వైభవానికి ఎంతో ప్రఖ్యాత ఉంది . మకర సంక్రమణ ఉత్తరాయణ మహాపుణ్యకాలంలో సంక్రాంతి కనుమ నాడు కోనసీమలోని మొసలిపల్లి శివారు జగ్గన్నతోటలో జరిగే ఏకాదశ రుద్రుల సమాగమము అత్యంత ప్రాచీనమైన, చారిత్రాత్మకమైన, అతిపురాతనమైన, పవిత్రమైన సమాగమం. ప్రాచీనకాలంలో మొట్టమొదటిగా ఈ తోటలోనే ఈ పదకొండు గ్రామాల రుద్రులు సమావేశమయ్యారని ప్రతీతి. ఈ తోటలో ఏవిధమైన గుడి గానీ, గోపురం గానీ ఉండవు.. ఇది పూర్తిగా కొబ్బరితోట. ఈ ఏకాదశరుద్రులు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ సమావేశం అవ్వడంతో ఈ తోట విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఏకాదశరుద్రుల కొలువు. హిందూధర్మశాస్త్రాల ప్రకారం.. ఏకాదశరుద్రులు ఒక్కచోటకొలువు తీరేది ప్రపంచం మొత్తం మీదా, ఈ భూమండలం మొత్తానికీ ఒక్కచోటే అదీవేదసీమ అయినటువంటి కోనసీమలోనే.. లోక కల్యాణార్ధం ఈ పదకొండు గ్రామాలశివుళ్లు జగ్గన్నతోటలో సమావేశం అయ్యి లోక విషయాలుచర్చిస్తారని ప్రతీతి. సుమారు 400 సంవత్సరాల క్రితం నుండి ఈ సంప్రదాయం ఉందనీ తీవ్రమైన పరిస్థితులు వచ్చిన 17 వశతాబ్ధంలో ఈ 11 గ్రామాల రుద్రులు ఈ తోటలోనే సమావేశం అయ్యి.. లోక రక్షణగావించారని ప్రతీతి. అప్పటి నుండీ క్రమం తప్పకుండా ప్రతీ సంవత్సరమూ కనుమ రోజు ఎన్ని అవాంతరాలు ఎదురైనా , భూమి తల్లక్రిందులైనా ఈ రుద్రులను ఒక్కచోట చేర్చుతారు ఈ గ్రామస్తులు. సంస్థానదీశులైన శ్రీరాజావత్సవాయి జగన్నాధమహారాజుకు చెందిన ఈతోటజగ్గన్న తోట అనే పేరుతో స్థిరపడింది .

ఈ ఏకాదశరుద్రులు కొలువైన గ్రామాలు అంబాజీపేట మండలంలో ని వ్యాఘ్రేశ్వరం-శ్రీవ్యాఘ్రేశ్వరస్వామి (బాలాత్రిపురసుందరీ)
పుల్లేటికుర్రు-అభినవవ్యాఘ్రేశ్వరస్వామి (బాలాత్రిపురసుందరి)
మొసలపల్లి-మధుమానంతభోగేశ్వరస్వామి
గంగలకుర్రు-చెన్నమల్లేశ్వరుడు
గంగలకుర్రు(అగ్రహారం)-వీరేశ్వరుడు
పెదపూడి-మేనకేశ్వరుడు
ఇరుసుమండ-ఆనందరామేశ్వరుడు
వక్కలంక-విశ్వేశ్వరుడు
నేదునూరు–చెన్నమల్లేశ్వరుడు
ముక్కామల-రాఘవేశ్వరుడు
పాలగుమ్మి-చెన్నమల్లేశ్వరుడు.

 

ఈ స్వామి వారలను “ప్రభలపై” అలంకరించి మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో, భాజాబజంత్రీలతో “శరభాశరభా” హరహరమహాదేవ” అంటూ ఆయా గ్రామాల నుంచి వీరినిమోస్తూ ఈ తోటకు తీసుకువస్తారు. ఈ తోట మొసలపల్లి గ్రామంలో ఉంది. కనుక దీనికి ఆతిధ్యము మొసలపల్లికి చెందిన మధుమానంత భొగేశ్వరుడు మిగతా గ్రామరుద్రులకు ఆతిథ్యం ఇస్తారు. ఈ రుద్రుడు అన్ని ప్రభల కన్నాముందే తోటకు చేరుకుని అందరూ రుద్రులూ తిరిగి వెళ్లిన తరువాత వెళ్లడం ఆనవాయితీ. ఈ ఏకాదశరుద్రులకు అధ్యక్షత వహించేది వ్యాఘ్రేశ్వారానికి చెందిన రుద్రుడు “శ్రీవ్యాఘ్రేశ్వరుడు”. ఈవ్యాఘ్రేశ్వరుడుకి చెందిన ప్రభ తోటలోకి రాగానే మిగతా రుద్ర ప్రభలన్నింటినీ మర్యాదా పురఃస్సరంగా ఒక్కసారిలేపి మళ్లీ కిందకుదించుతారు . ఈ 11 శివుళ్లుకు వ్యాఘ్రేశ్వరుడు అధిష్టానము. ఇక్కడ మరోవిశిష్టత ఏమిటీ అంటే గంగలకుర్రు మరియూ గంగలకుర్రు (అగ్రహారం) రుద్రప్రభలు ఈ తోటకి రావాలంటే మధ్యలో కాలువ (కౌశిక) దాటాలి. ఆ ప్రభలు ఆకాలువలోంచి ఏమాత్రం తొట్రూలేకుండా “హరాహరా” అంటూ తీసుకువచ్చే ఆగ్రామస్తుల ధైర్యం చూడడానికి రెండు కళ్లు చాలవు. ఎందుకంటే కాలువలో మామూలుగానే నడువలేం. అలాంటిది ఒక 30 మంది మోస్తే కానీ లేవని ప్రభ ఆ కాలువ లోంచి తోటలోకి తీసుకువచ్చే సన్నివేశం చూసేవారికి ఒల్లుగగుర్పొడుస్తుంది. ఇక ఆ కాలువలోకి వచ్చే ముందు ఒక వరిచేనుని ఆ ప్రభలు దాటవలిసి వస్తుంది. ఆ చేనుని తొక్కుతూ.. పంటను తొక్కుతూ వచ్చినా.. రైతులు భాదపడక సాక్షాత్తూ ఆపరమేశ్వరుడు తమ చేలగుండా వెళ్ళడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఈ తీర్థంను దర్శించడానికి ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన కోనసీమప్రజలే గాక, దేశవిదేశీయిలు వచ్చిదర్శించి తరిస్తారు. 11 గ్రామాల నుండి ప్రభలను తీసుకువచ్చే రహదారుల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.