Shane Dowrich retires from international cricket: వెస్టిండీస్ కీపర్ షేన్ డౌరిచ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో ఇంగ్లండ్‌తో జరుగనున్న వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో 32 ఏళ్ల డౌరిచ్‌కు చోటు లభించినప్పటికీ.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. తన రిటైర్మెంట్ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపాడు. దాంతో ఇంగ్లండ్ సిరీస్ ఆడకుండానే.. డౌరిచ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. డౌరిచ్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం పట్ల విండీస్ క్రికెట్ బోర్డు (సీడబ్యుఐ) ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
2015లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన షేన్ డౌరిచ్.. విండీస్ తరఫున 35 టెస్ట్‌లు, ఓ వన్డే ఆడాడు. టెస్ట్‌ల్లో 1570 పరుగులు చేయగా.. అందులో 3 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. శ్రీలంకపై 125 నాటౌట్ అతడి అత్యుత్తమం. ఒక వన్డేలో (2019లో బంగ్లాదేశ్‌పై) 6 రన్స్ చేశాడు. వికెట్ కీపర్‌గా డౌరిచ్ 91 మందిని ఔట్ (85 క్యాచ్‌లు, 5 స్టంపింగ్‌లు) చేయడంలో భాగమయ్యాడు. డిసెంబర్ 2020లో న్యూజిలాండ్‌పై వెస్టిండీస్ తరపున చివరగా ఆడాడు.
Also Read: Mother Dead Body: ఏడాది కాలంగా.. తల్లి శవంతోనే జీవిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు!
నాలుగు సంవత్సరాల తర్వాత జాతీయ జట్టులో చోటు వస్తే.. ఆడాల్సింది పోయి రిటైర్మెంట్ ప్రకటించడం ఏంటని? అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 32 ఏళ్లకే రిటైర్మెంట్ ఏంటని అభిమానులతో సహా మాజీలు సైతం ప్రశ్నిస్తున్నారు. షేన్ డౌరిచ్ రిటైరయ్యాడని, ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్ జట్టు నుంచి అతడు వైదొలిగినట్లు సీడబ్యుఐ ప్రకటించింది. 3 వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు డిసెంబర్ 3 నుంచి కరీబియన్ దీవుల్లో పర్యటించనుంది.