West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు

Madarsa

Madarsa

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో గుర్తింపు లేని మదర్సాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర సర్వే అనంతరం నిబంధనలు పాటించని 252 ప్రభుత్వేతర, ప్రైవేట్ మదర్సాలను మూసివేయాలని అధికారులు సంచలన ఆదేశాలు జారీ చేశారు. మరో 100 మదర్సాలకు మౌలిక సదుపాయాలు, అవసరమైన అనుమతులు లేవనే కారణంతో షోకాజ్ నోటీసులు పంపారు. జూన్ ప్రారంభం నుంచి అన్ని జిల్లాల్లో ప్రభుత్వం చేపట్టిన గ్రౌండ్ లెవెల్ సర్వేలో వీటి వద్ద సరైన అనుమతి పత్రాలు లేవని, మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉందని స్పష్టమైంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆదేశాల మేరకు అధికారిక, అనధికారిక మదర్సాల లెక్క తేల్చడానికి ఈ తనిఖీలు ప్రారంభించినట్లు మైనారిటీ సంక్షేమం, మదర్సా విద్య శాఖ మంత్రి క్షుదీరామ్ తుడు తెలిపారు. నోటీసులు అందుకున్న 100 మదర్సాలు ఇచ్చే సమాధానాలను పరిశీలించిన తర్వాతే వాటిపై తదుపరి చర్యలు ఉంటాయని, ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి చట్టబద్ధంగా నడిచే మదర్సాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు ఈ చర్యల నేపథ్యంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దిలీప్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మదర్సాల కార్యకలాపాలన్నీ అనుమానాస్పదంగానే ఉన్నాయని, రాష్ట్రంలో జరిగిన ప్రతీ ఉగ్రదాడిలోనూ ఏదో ఒక మదర్సా ఉపాధ్యాయుడి ప్రమేయం బయటపడిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఉగ్రవాదులకు ఈ మదర్సాలు ఆశ్రయం కల్పిస్తున్నాయని, దేశవ్యతిరేక కార్యకలాపాలకు నిలయాలుగా మారుతున్నాయని విమర్శించారు. గతంలో చాలామంది నాయకులు ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ సమస్యను పరిష్కరించలేకపోయారని, కానీ తమ ప్రభుత్వం దీన్ని పూర్తిగా పరిష్కరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం నడిచే వాటికి ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా మదర్సాలు తెరిచి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అయితే అధికార పక్షం తీరుపై ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కుణాల్ ఘోష్ మండిపడ్డారు. అన్ని మదర్సాలను ఒకేలా చూడటం సరికాదని, ప్రతి సంస్థను అనుమానాస్పదంగా చిత్రీకరించకూడదని స్పష్టం చేశారు.