NTV Telugu Site icon

Tamilnadu CM MK Stalin: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం..

Mk Stalin

Mk Stalin

Tamilnadu CM MK Stalin: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నళినీ శ్రీహరన్ సహా ఆరుగురు దోషులను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం స్వాగతించారు. ‘ఆరుగురి విడుదలపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను’ అని స్టాలిన్ శుక్రవారం ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును ప్రశంసించిన స్టాలిన్, ప్రజాస్వామ్య సిద్ధాంతానికి ఇది చారిత్రాత్మకమైనదని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు డీఎంకే ఈ వ్యక్తుల విడుదల కోసం ఎప్పుడూ వాయిస్‌ ఇస్తోందని ఆయన అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నళినీ శ్రీహరన్‌తో పాటు మరో ఐదుగురు జీవిత ఖైదును అనుభవిస్తున్నారు. జైలులో మంచి ప్రవర్తన ఉందనే కారణంతో వారిని సుప్రీంకోర్టు విడుదల చేసింది.

రాజీవ్ గాంధీ మే 21, 1991న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో బహిరంగ ర్యాలీ సందర్భంగా లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ) గ్రూప్‌కి చెందిన మహిళా ఆత్మాహుతి బాంబర్ చేత హత్య గావించబడ్డారు. హత్యలో వారి పాత్రకు ఏడుగురు దోషులకు మరణశిక్ష విధించబడింది. వారిలో నళిని శ్రీహరన్, ఆర్‌పీ రవిచంద్రన్, జయకుమార్, సంతన్, మురుగన్, రాబర్ట్ పయాస్, ఏజీ పెరారివాలన్ ఉన్నారు.

Zelensky: ఖేర్సన్‌ మాదే.. రష్యన్‌ దళాలు ఉపసంహరించుకున్న తర్వాత జెలెన్స్కీ ప్రకటన

2000 సంవత్సరంలో నళిని శ్రీహరన్‌కు జీవిత ఖైదు విధించబడింది. ఆ తర్వాత 2014లో మిగిలిన ఆరుగురు దోషుల శిక్షను కూడా తగ్గించారు. అదే సంవత్సరంలో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈ కేసులో మొత్తం ఏడుగురు దోషులను విడుదల చేయాలని సిఫార్సు చేశారు. ఈ ఏడాది మేలో, ఏడుగురు దోషుల్లో ఒకరైన ఏజీ పెరారివాలన్ 31 ఏళ్ల జైలు జీవితం గడిపిన తర్వాత విడుదలయ్యారు.