NTV Telugu Site icon

Weddings Candidates: ఓటర్ల టైం.. పిలవని పేరంటానికైనా నాయకులు పోవాల్సిందే..

Marrige

Marrige

Weddings Candidates: పెళ్లిళ్లంటే హడావుడి మామూలుగా ఉండదు. వాళ్లకు ఉన్న స్థాయిని బట్టి పెళ్లికి పెద్దవాళ్లను పిలిచి గ్రాండ్ గా పెళ్లిళ్లు చేస్తుంటారు. అదే రాజకీయ నాయకులు వస్తే ఆ పెళ్లిలో సందడే వేరబ్బా.. మా పెళ్లికి ఫలానా రాజకీయ నాయకుడు వచ్చాడంటూ కొన్నేళ్ల పాటు గొప్పలు చెప్పుకుంటారు. కానీ.. ప్రస్తుతం ట్రెండ్ మారింది. పెళ్లిళ్లకు నాయకులు వెళ్లడం తగ్గిపోయింది. తెలిసిన వాళ్లు , బంధువులు పిలిచిన పేరంటాలకు, పెళ్లిళ్లకు నాయకులు వెళ్లడం మానేశారు. కానీ.. ఇప్పుడు ఎలక్షన్స్ సీజన్ ఓటరే ఇప్పుడు వారికి బాస్ అయిపోయాడు. తనకు ఓటు వేయాలంటే నాయకుడు ఓటరు దగ్గరకు వెళ్లాల్సిందే. పిలవని పేరంటమైనా హాజరవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. ఇంటింటికి వెళ్లి ఓటువేయాలని అడగాల్సిన పరిస్థితి ఏమోగానీ పేరంటమైనా.. పెళ్లైనా నాయకులు హాజరు అయితే అక్కడే వందల మందిని ఒకే సారి కలిసే వీలు కూడా ఉంటుంది. ఇన్ని రోజులు పేరంటాలకు రావాలని, పెళ్లిళ్లకు హాజరు కావాలని నాయకుల ఇంటికి వెళ్లి పిలిచినా బిజీ బిజీగా గడిపిన నాయకులు ఇప్పుడు ఓటు కోసం తగ్గాల్సిన పరిస్థితి దాపురిచింది. దీంతో అటు సభలు, సమావేశాల్లో పాల్గొంటూ ప్రచారం చేసుకుంటూనే.. ఇటు పెళ్లిళ్లు, పేరంటాలకు కూడా హాజరవుతున్నారు నాయకులు. అయితే మరోవైపు ఎన్నికల వేళ పెళ్లిళ్ల రద్దీతో రాజకీయ పార్టీలను కలవరపెడుతోంది. వివాహానికి కార్తీకమాసం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. ఈ నెల 16, 19, 21, 22, 23, 24, 26, 29 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి.

ఆ తరువాత డిసెంబర్ నెలాఖరులో ఉంటాయి. ఈ తేదీల్లో జంటనగరాల్లో 50 వేల నుంచి లక్షకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 30న శాసనసభ ఎన్నికల పోలింగ్‌ జరగనున్న విషయం తెలిసిందే. అంటే ఓటు వేయడానికి 10 రోజుల ముందు వివాహ వేడుకలు ప్రారంభమవుతాయి. అభ్యర్థుల ప్రచారం, పెళ్లిళ్లు ఒకేసారి జరగనుండటంతో రాజకీయ పార్టీల అభ్యర్థులు, నేతలు మండపాలలో సందడి చేయనున్నారు. అంతకుముందు ప్రజాప్రతినిధుల ఇళ్లకు వెళ్లి వార్తాపత్రికలు అందజేసి పెళ్లికి రావాలని పదే పదే అడిగేవారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నందున ఆహ్వానం అందని అభ్యర్థులు కూడా కళ్యాణ మండపాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నెల 29న జరిగే వివాహాలు ఓటింగ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే పెళ్లి కోసం దూర ప్రాంతాలకు వెళ్లే వారిని ఎలా ఆకర్షించాలనేది అభ్యర్థులకు ప్రశ్నగా మారింది. పెళ్లయిన మరుసటి రోజు తీసుకువస్తేనే ఓటు వేయగలరు. కావున ద్వితీయ శ్రేణి నాయకులు వాటిపై దృష్టి సారించి జాగ్రత్తగా ఉండాలని పోటీలో పాల్గొనే అభ్యర్థులు సూచిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా పోలింగ్ రోజు వచ్చేలా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏదైతేనేం పెళ్లిళ్లలకు అయితే రాజకీయ నాయకులు హాజరు అయ్యేందుకు సిద్దమయ్యారు కానీ.. మరి ఓటరును మళ్లీ ఇక్కడకు రప్పించి ఎలా ఓటు వేయించాలనే ఆలోచనలో పడ్డారు.
Virat Kohli: నువ్ మగాడివిరా బుజ్జి.. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌కే సాధ్యం కాలేదు!