కరోనాతో గత రెండేళ్లుగా శుభకార్యాలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం వైరస్ కాస్త తగ్గుముఖం పట్టడంతో ఈ నెలలో చాలా జంటలు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నాయి. అలాగే అక్టోబర్, నవంబర్‌ల్లోనూ మంచి ముహూర్తాలున్నాయని అంటున్నారు పురోహితులు. ఈనెలలో అధికంగా పెళ్లిళ్లు ఉండడంతో అన్ని రంగాల వారికి చేతినిండా పని దొరుకుతుంది. ఫ్లవర్ డెకరేషన్, బాజా భజంత్రీలు, వంట మాస్టర్స్‌తో పాటు ఫొటో, వీడియోగ్రాఫర్స్, పురోహితులకు మంచి డిమాండ్ ఏర్పడింది. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే కళ్యాణ మండపాలు, కన్వెన్షన్ హాల్స్, హోటళ్లు ముందుగానే రిజర్వ్ చేసుకున్నారు. అడ్వాన్స్ బుకింగ్‌లతో అన్నింటికి హౌస్ పూల్ బోర్డులు పెట్టేశారు. అన్ని రకాల ఈవెంట్లకు అధిక మొత్తాల్లో అడ్వాన్సులు చెల్లించి ఖరారు చేసుకున్నారు.
రెండేళ్ల నుంచి ఉపాధి లేక చతికిలపడ్డ వారికి… ఇప్పుడు చేతినిండా పని దొరుకుతుండడంతో.. వాళ్లలో సంతోషం నెలకొంది. అటు మార్కెట్‌లో వస్త్రాలు, బంగారం, సరుకుల కొనుగోళ్ల సందడి నెలకొంది. పట్టణాల్లోని బంగారం షాపులు, వస్త్ర దుకాణాలు రద్దీగా మారాయి. మరోవైపు పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా తూర్పుగోదావరి జిల్లాలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. వివాహాలకు రాష్ట్రం అంతటా 150 మంది వరకు అతిథులకు అనుమతిస్తే.. ఇక్కడ వంద మంది మాత్రమే వచ్చేలా ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. కానీ ప్రస్తుతం భారీఎత్తున జరుగుతున్న వివాహ వేడుకలకు ఈ నిబంధనలేవీ జిల్లాలో అమలుకావడం లేదు. ఎక్కడికక్కడ వందల్లో జనం కల్యాణ మండపాలకు హాజరువుతున్నారు. ఎక్కడా అధికారుల పర్యవేక్షణ ఉండడం లేదు. దీంతో కేసులు మరింత విజృంభిస్తాయనే ఆందోళన నెలకొంది.