Weather Forecast Today: వాయుగుండం ప్రభావం.. ఇవాళ పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు!

Heavy Rains Ap

Heavy Rains Ap

వాయవ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు పడనున్నాయి. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఈ వాయుగుండం సోమవారం మధ్యాహ్నానికి మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారి ఒడిశాలోని చాంద్‌బలి-కానింగ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

వాయుగుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పైనా కనిపించనుంది. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం ప్రాంతం, విశాఖపట్నం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఈ విషయాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉందని సూచించింది.

మరోవైపు సముద్రం తీవ్ర అలజడిగా మారే అవకాశమున్న నేపథ్యంలో మత్స్యకారులకు అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఏడు మీటర్ల కంటే తక్కువ పొడవు కలిగిన పడవల్లో సముద్రంలోకి వెళ్లడం ప్రమాదకరమని, బుధవారం వరకు చేపల వేటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ జారీ చేసే తాజా హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. తెలంగాణలో కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో వచ్చే రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మేఘావృత వాతావరణం కొనసాగుతుందని, ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.