NTV Telugu Site icon

Pawan Kalyan: అందుకే నేత వస్త్రాలను ధరిస్తున్నాను.. కీలక ప్రకటన చేసిన పవన్‌ కళ్యాణ్

Pawan Kalyan

Pawan Kalyan

AP Deputy CM Pawan Kalyan: చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన విడుదల చేశారు. చేనేతకు జీవం పోయాలని ఆయన సూచించారు. దేశంలో అతిపెద్ద అసంఘటిత ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే రంగాల్లో చేనేత ఒకటి అని.. చేనేత ఒక కళాత్మకమైన పరిశ్రమ అంటూ చెప్పుకొచ్చారు. ఏపీలో ఉప్పాడ, మంగళగిరి, చీరాల, పెడన, పొందూరు, ఎమ్మిగనూరు, వెంకటగిరి చేనేత వస్త్రాలకు ప్రతీకలు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. చేనేత దినోత్సవం సందర్భంగా ఈ రంగంపై ఆధారపడ్డ ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Read Also: AP Cabinet: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. ఆ బిల్లుకు ఆమోదం

దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో చేనేత వస్త్రాలు అనే మాట ప్రజల్లో ఒక భావోద్వేగాన్ని నింపాయన్నారు. అలాంటి చేనేత రంగానికి జీవం పోయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాష్ట్రంలోని ఎన్.డి.ఏ. ప్రభుత్వం కచ్చితంగా చేనేత పరిశ్రమకు, ఈ రంగంపై ఆధారపడ్డ నేతన్నలకు భరోసా ఇస్తుందని హామీ ఇచ్చారు. అదే విధంగా ప్రజలు సైతం ఈ రంగానికి ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని సంవత్సరాల కిందటే చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని చెప్పినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆ క్రమంలోనే నేత వస్త్రాలను ధరిస్తున్నానని వెల్లడించారు. యువత, ఉద్యోగులు వారంలో ఒక రోజైనా చేనేత వస్త్రాలను ధరిస్తే ఈ రంగంపై ఆధారపడ్డవారికి ధీమా కలుగుతుందని పవన్ స్పష్టం చేశారు.