NTV Telugu Site icon

SRH-HCA: హెచ్‌సీఏ బెదిరింపులు.. హైదరాబాద్‌ వీడిపోతామంటున్న ఎస్‌ఆర్‌హెచ్‌!

Hca Srh

Hca Srh

నిత్యం వివాదాల్లో నిలిచే హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) మరోసారి వార్తల్లో నిలిచింది. ఉచిత టిక్కెట్ల కోసం హెచ్‌సీఏ ఉన్నతాధికారులు, ముఖ్యంగా అధ్యక్షుడు జగన్ మోహన్ రావు.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌)ను బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ చేస్తుండడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంఛైజీ హైదరాబాద్‌ నగరాన్ని వీడిపోతామని హెచ్చరించింది. ఐపీఎల్ 2025 సందర్భంగా కోరినన్ని ఫ్రీ పాస్‌లు ఇవ్వనందుకు ఓ మ్యాచ్‌లో తమకు కేటాయించిన కార్పొరేట్‌ బాక్స్‌కు తాళాలు వేసినట్లు సన్‌రైజర్స్‌ ప్రతినిధి ఒకరు హెచ్‌సీఏ కోశాధికారికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబందించిన లేఖ తమ వద్ద ఉందని ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ సొంత వేదికైన ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తమ ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడటం గురించి పునరాలోచించుకుంటామని, అవసరమైతే హైదరాబాద్‌ వీడిపోతామని హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాస్ రావుకు ఎస్‌ఆర్‌హెచ్‌ జనరల్ మేనేజర్ శ్రీనాథ్ రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. హెచ్‌సీఏ, ముఖ్యంగా అధ్యక్షుడి ప్రవర్తనను బట్టి చూస్తే ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్‌ ఆడడం ఇష్టం లేనట్లుగా అనిపిస్తోందని పేర్కొన్నారు. బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం, మా యాజమాన్యంతో మాట్లాడి మరో వేదికకు మారిపోతామని స్పష్టం చేశారు. హెచ్‌సీఏ నుంచి గత రెండేళ్లుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని లేఖలో రాసుకొచ్చారు.

‘ఉచిత టిక్కెట్ల కోసం హెచ్‌సీఏ నుంచి వస్తున్న బ్లాక్‌మెయిలింగ్‌ నేపథ్యంలో ఈ లేఖ రాస్తున్నాం. గత 12 ఏళ్లుగా మేము హెచ్‌సీఏతో కలిసి పని చేస్తున్నాం. అయితే గత రెండేళ్ల నుంచే బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్‌ ఎక్కువ అయ్యాయి. ఒప్పందం ప్రకారం హెచ్‌సీఏకు 10 శాతం కాంప్లిమెంటరీ టిక్కెట్లు ఇస్తున్నాం. ఎఫ్‌12ఏ కార్పొరేట్‌ బాక్స్‌ (50 టిక్కెట్లు) కూడా అందులో భాగమే. ఈ ఏడాది ఎఫ్‌12ఏ బాక్స్‌ సామర్థ్యం 30 మాత్రమే అని చెబుతూ.. మరో బాక్స్‌లో 20 టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై చర్చిద్దాం అని చెప్పాము. మేం ఉప్పల్ స్టేడియానికి అద్దె చెల్లిస్తున్నాం కాబట్టి.. ఐపీఎల్‌ సమయంలో మా నియంత్రణలోనే ఉంటుంది. అయితే గత మ్యాచ్‌ సందర్భంగా ఎఫ్‌-3 బాక్సుకు లాక్ వేశారు. 20 టికెట్లు ఇస్తేనే బాక్స్ తెరుస్తామని బెదిరించారు. మ్యాచ్‌ ఆరంభానికి గంట ముందు వరకు బాక్స్ తెరవలేదు. చాలా కఠినంగా వ్యవహరించారు’ అని ఎస్‌ఆర్‌హెచ్‌ జనరల్ మేనేజర్ శ్రీనాథ్ లేఖలో పేర్కొన్నారు.

‘ఈ పరిస్థితుల్లో హెచ్‌సీఏతో కలిసి పని చేయడం కష్టం. హెచ్‌సీఏ నుంచి బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్‌ ఇదే మొదటిసారి కాదు.. గత రెండేళ్లలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఐపీఎల్ 2025 సందర్భంగా అయితే హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు ఎన్నోసార్లు బెదిరించారు. హెచ్‌సీఏ, అధ్యక్షుడి ప్రవర్తనను బట్టి చూస్తే ఉప్పల్ స్టేడియంలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఆడడం ఇష్టం లేనట్లుగా ఉంది. అదే హెచ్‌సీఏ ఉద్దేశమైతే.. బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించి మరో వేదికకు వెళ్ళిపోతాం. ఈ విషయం గురించి చర్చించేందుకు హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌తో ఓ సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం’ అని శ్రీనాథ్‌ లేఖలో రాసుకొచ్చారు. నిజానికి గతంలో కంటే ఈ రెండేళ్లలో హెచ్‌సీఏ చాలా వివాదాల్లో చిక్కుకుంటోంది.