Site icon NTV Telugu

Water Levels in Projects: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు.. ప్రాజెక్టులకు జలకళ

Telangana Projects

Telangana Projects

Water Levels in Projects: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు.. 48 గంటలుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. ప్రాజెక్టుల గేట్లు తెరచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. గోదావరికి భారీఎత్తున వరద నీరు వస్తుండటంతో భద్రాచలం వద్ద నది నీటి మట్టం 43 అడుగులు దాటడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరికి వరద తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రాంతాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నదీపరివాహక ప్రాంతాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు ఏపీలోని ధవళేశ్వరం వద్ద కూడా గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నదిలో 5 లక్షల క్యూసెక్కుల నీరు దాటితే.. మొదటిప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read: Harish Rao : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. వైద్య శాఖను అప్రమత్తం చేసిన మంత్రి

నిజాంసాగర్‌ ప్రాజెక్టు
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాతో పాటు ఎగువన ఉన్న జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా శ్రీరాంసాగర్ , నిజాం సాగర్‌లకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని 33 మండలాల్లో భారీగా వర్షం కురుస్తోంది. ఇంధల్వాయిలో అత్యధికంగా 10 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ఇన్ ఫ్లో 22,800 క్యూసెక్కులు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా.. ప్రస్తుతం 1390 అడుగుల మేర నీరు ఉంది. నీటి సామర్థ్యం 17 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 4.2 టీఎంసీలుగా ఉంది.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరిగింది. ఇన్ ఫ్లో 59,166 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1046 క్యూసెక్కులుగా ఉంది. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1073 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 37 టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: Telangana Rains: భారీ వర్షాలపై అప్రమత్తం, ప్రాణనష్టం జరగకుండా చూడాలి.. అధికారులకు సీఎస్ ఆదేశాలు

సింగూరు ప్రాజెక్టు
సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఇన్ ఫ్లో 8440 క్యూ సెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 385 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా.. ప్రాజెక్టు ప్రస్తుత నీటి సామర్థ్యం 19.253 టీఎంసీలుగా ఉంది.

సరస్వతి బ్యారేజ్‌
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం సరస్వతీ బ్యారేజ్‌కి వరద కొనసాగుతోంది. బ్యారేజ్ 66 గేట్లలలో 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తు్‌న్నారు. ఇన్ ఫ్లో 5265 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 900 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజ్ సామర్థ్యం 10.87 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.64 టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు.

కడెం ప్రాజెక్టు
నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడం వల్ల అధికారులు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. గేట్ నంబర్ 9, 17 ఎత్తి 11,091 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులకు గాను 691.925 చేరింది. నీటి సామర్థ్యం 7.603 టీఎంసీలకు గాను, 5.507 టీఎంసీల నీరు ఉంది. ఇన్ ఫ్లో 10978 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా.. ఔట్ ఫ్లో 11091 క్యూసెక్కులుగా ఉంది.

Exit mobile version