వాటర్ యాపిల్… దీనినే రోజ్ యాపిల్, గులాబ్ జామూన్ కాయ అని కూడా పిలుస్తారు. అయితే నిజానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ పండు గురించి చాలా మందికి తెలియదు. తక్కువ మందికి తెలిసిన పండు అయినప్పటికీ దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. దీనిని పోషకాలగనిగా చెప్పుకోవచ్చు. విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ ఎ లాంటి అనేక రకాల పోషకాలు దీనిలో మెండుగా ఉన్నాయి. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ తమ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి రకరకాల డైట్‌లను ఫాలో అవుతున్నారు. అలాంటి వారికి ఈ వాటర్ యాపిల్ ఒక వరంలాంటిదని చెప్పొచ్చు. దీనిని తినడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటుగా కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. వీటిన్నింటితో పాటుగా వాటర్ ఆపిల్‌లో ఇనుము, కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా ఈ పండు వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి.
ఈ వాటర్ ఆపిల్ తియ్యగా ఉంటుంది. అందుకే దీనిని ఒక్కసారి టేస్ట్ చూస్తే మళ్లీ మళ్లీ తినాలంటారు. దీనిలో హైడ్రేటింగ్ లక్షణాలు ఉన్నాయి.దాహాన్ని తగ్గించడంలో వాటర్ యాపిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పండు నోట్లో వేసుకోగానే మెత్తగా కరిపోతుంది. అంతే కాకుండా దీనిని తినడం వలన ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. శరీరంలోని ఎముకలు,కీళ్లు కూడా బలంగా తయారవుతాయి.వీటితో పాటు కండరాల తిమ్మిరి తగ్గించడంలో కూడా ఈ పండు ఉపయోగపడుతుంది.
షుగర్ వ్యాధి గ్రస్థులకు వరం ఈ వాటర్ యాపిల్:
షుగర్, బీపీ ఈ మధ్య కాలంలో ఎవరిని కదిలించినా ఈ రెండింటితో బాధపడుతున్నాం అని చెప్పేవారే ఉంటున్నారు. షుగర్ పేషెంట్స్ అయితే ఏం తినాలన్నా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే. అయితే వారికి ఈ వాటర్ యాపిల్ ఒక వరం అని చెప్పొచ్చు.వాటర్ యాపిల్‌లో“జాంబోసిన్ “అనే ఒక రకమైన ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది పిండి పదార్ధాలను చక్కరగా మార్చకుండా అడ్డుకుంటుంది. దీని వల్ల రక్తంలో చక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి. అందుకే షుగర్ పేషెంట్స్ ఈ పండును ఎలాంటి సంకోచం లేకుండా తీసుకోవచ్చు. అంతే కాకుండా ఈ పండ్లలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మెండుగా ఉన్నాయి. వీటిని తినడం ద్వారా క్యాన్సర్,గుండె సంబంధిత వ్యాధులు, రక్తపోటు, మెదడుకు సంబందించిన ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. తెలుసుకున్నారుగా ఈ వాటర్ యాపిల్ ప్రయోజనాలు… మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వాటర్ ఆపిల్ ఎక్కడ కనిపించినా వదలకుండా తినేయండి.