NTV Telugu Site icon

Chandrayaan 3: చంద్రుడి ఉపరితలంపై ముందుగా బ్యాటింగ్ చేయాల్సిందే!

Chandrayaan 3

Chandrayaan 3

Team India Former Opener Wasim Jaffer Tweet on Chandrayaan 3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం బుధవారం సక్సెస్ అయిన విషయం తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన విక్రమ్‌ ల్యాండర్‌.. కొన్ని నిమిషాల్లోనే భూమిపై ఉన్న పర్యవేక్షణ కేంద్రంతో కమ్యూనికేట్ అయింది. జాబిల్లి యాత్రల్లో ఇప్పటిదాకా ఏ దేశం అందుకోలేకపోయిన సంక్లిష్ట లక్ష్యాన్ని ఇస్రో విజయవంతంగా ఛేదించింది. జాబిల్లిపై పరిశోధనల కోసం రష్యా ప్రయోగించిన లూనా-25 చతికిలపడి వారం రోజులు కూడా కాకముందే.. చంద్రయాన్‌ 3 విజయవంతంగా ల్యాండవ్వడం భారత సాంకేతిక సత్తాకు దర్పణం పట్టింది.

విక్రమ్‌ ల్యాండర్‌ తీసిన చంద్రుడి ఫొటోలను ఇస్రో కేంద్రానికి పంపింది. ఈ ఫొటోలను ఇస్రో తన ఎక్స్ (ట్విటర్) వేదికగా పంచుకుంది. చంద్రుడి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చంద్రుడి ఉపరితలం ఫొటోలపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తనదైన శైలిలో స్పందించాడు. చంద్రుడి ఉపరితలాన్ని క్రికెట్ పిచ్‌గా ఊహించుకున్న జాఫర్.. మొదట బ్యాటింగ్ తీసుకోవాల్సిన పిచ్ ఇది అని పేర్కొన్నాడు. ‘కచ్చితంగా ముందుగా బ్యాటింగ్ తీసుకోవాల్సిన పిచ్ ఇది. ముగ్గురు స్పిన్నర్లు, ఒక సీమర్, ముగ్గురు ఆల్‌రౌండర్‌లతో బరిలోకి దిగుతా’ అని జాఫర్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌ అయింది.

Also Read:

‘భారతదేశానికి చెందిన విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన చారిత్రక క్షణాలకు డబ్లిన్‌ నుంచి సాక్షులుగా నిలిచాం’ అని బీసీసీఐ ట్వీట్‌ చేసింది. ‘చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరిన తొలి దేశంగా భారత్‌ పేరు వినేందుకు సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికీ ఇది గర్వపడే క్షణం. ఇస్రో కష్టానికి అభినందనలు’ అని భారత్ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తెలిపాడు. ‘చంద్రయాన్‌ 3 బృందానికి అభినందనలు. మీరు దేశాన్ని గర్వపడేలా చేశారు. జై హింద్‌ అని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ట్వీట్‌ చేశాడు.

Show comments