NTV Telugu Site icon

Off The Record : టీడీపీలో ‘డోన్’ రగడ.. వర్గ పోరుతో సైకిల్ కు పంక్చర్

Tdp

Tdp

అధికారంలో లేకపోయినా ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీలో వర్గపోరు ఎక్కువే. ముఖ్యంగా ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్‌ నియోజకవర్గాల్లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. వీటిలో డోన్‌ టీడీపీ నివురు గప్పిన నిప్పులా మారింది. నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా మన్నె సుబ్బారెడ్డిని ప్రకటించినప్పటి నుంచీ మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌ వర్గం గుర్రుగా ఉంది. తరచూ సుబ్బారెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తున్నారట. డోన్‌లో పార్టీ బాధ్యతలు తిరిగి కేఈ కుటుంబానికే ఇవ్వాలనే డిమాండ్‌ ఉంది. ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ నియోజకవర్గంలో అప్పట్లో కరపత్రాలు కూడా పంచారు. కానీ.. సుబ్బారెడ్డికే పగ్గాలు అప్పగించడంతో కేఈ ప్రభాకర్‌ కొంతకాలం సైలెంట్‌ అయ్యారు. అధినేత నిర్ణయం వారికి రుచించ లేదు. సమయం కోసం చూశారో ఏమో.. ప్రభాకర్‌ తన జన్మదిన వేడుకల్లో ఒక్కసారిగా బరస్ట్‌ అయ్యారు. ఆయన చేసిన వ్యాఖ్యలే టీడీపీలో సెగలు రాజేస్తోంది.
Also Read : Bandi Sanjay : 5వ విడత ప్రజాసంగ్రామ యాత్ర.. ర్యూట్‌ మ్యాప్‌ ఆవిష్కరణ

సుబ్బారెడ్డే వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి డోన్‌లో పోటీ చేస్తారని పార్టీ అధినేత గతంలోనే స్పష్టం చేశారు. ఆ మేరకు సుబ్బారెడ్డి నియోజకవర్గంలో పని చేసుకుంటున్నారు కూడా. ఇంతలో కేఈ కుటుంబమే డోన్‌ బరిలో ఉంటుందని ప్రకటించారు ప్రభాకర్‌. ఆ ప్రకటన కలకలం రేపుతోంది. పత్తికొండ, డోన్‌ రెండుచోట్లా పోటీ చేస్తామన్నది మాజీ మంత్రి మాట. అంతేకాదు.. ఏ అనుభవం లేని వ్యక్తి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించడంతో సమస్య మరింత జఠిలంగా మారింది. ఇటీవల కర్నూలు జిల్లాలో టీడీపీ అధినేత పర్యటనపై తెలుగు తమ్ముళ్లు చర్చిస్తున్న తరుణంలో ప్రభాకర్‌ వ్యాఖ్యలు వాళ్లకు షాక్‌ ఇచ్చాయట.

ప్రభాకర్‌ కామెంట్స్‌తో దేశం శిబిరంలో గందరగోళం
డోన్‌లో 2014, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి కేఈ ప్రతాప్‌ పోటీ చేసి ఓడిపోయారు. 2014 నుంచి ఆయనే ఇక్కడ పార్టీ ఇంఛార్జ్‌. వరసగా రెండుసార్లు ఓడిపోవడంతో మనస్తాపం చెందారో ఏమో.. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ప్రతాప్‌. దాంతో పార్టీకి నియోజకవర్గంలో ఎవరూ దిక్కులేకుండా పోయారు. ఆ సమయంలోనే ఇంఛార్జ్‌గా సుబ్బారెడ్డిని ఎంపిక చేసింది టీడీపీ అధిష్ఠానం. సుబ్బారెడ్డే ఎన్నికల్లో పోటీ చేస్తారని స్పష్టత ఇవ్వడంతో కేడర్‌ కూడా దానికి తగ్గట్టుగానే ట్యూన్ అయ్యిందట. అయితే కేఈ ప్రభాకర్‌ తాజా కామెంట్స్‌తో సీన్‌ రివర్స్‌ అయ్యింది. పసుపు శిబిరంలో మరోసారి గందరగోళానికి దారితీశాయి ఆ వ్యాఖ్యలు.

డోన్‌ సమస్య పరిష్కారం టీడీపీకి సవాలేనా?
డోన్‌, పత్తికొండ సీట్ల విషయంలో కేఈ కుటుంబం పట్టుపడితే టీడీపీ అధినేత ఏం చేస్తారు? తన నిర్ణయాన్ని మార్చుకుంటారా? ముఖ్యంగా డోన్‌ విషయంలో ఏం చేస్తారు అనేది పెద్ద ప్రశ్న. వచ్చే ఎన్నికలు కీలంగా భావిస్తున్న టీడీపీకి ఈ సమస్య పరిష్కారం సవాలేనని కేడర్‌ భావిస్తోందట. సుబ్బారెడ్డి బరి నుంచి తప్పుకొంటారా? అదే పరిస్థితి ఎదురైతే ఆయన ఎంత వరకు సహకరిస్తారు? ఒకవేళ సుబ్బారెడ్డే పోటీ చేస్తారని స్పష్టత ఇస్తే.. కేఈ కుటుంబం ఏం చేస్తుంది? అనే ప్రశ్నల చుట్టు ప్రస్తుతం డోన్‌ రాజకీయం తిరుగుతోంది.