NTV Telugu Site icon

Volunteer Attack: కులం పేరుతో దూషిస్తూ మహిళలపై గ్రామ వాలంటీర్‌ దాడి

Attack

Attack

Volunteer Attack: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటి దగ్గరకే పాలన అందించాలన్న ఉద్దేశంతో గ్రామ/వార్డు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు.. అయితే, కొన్ని సందర్భాల్లో వాంటీచర్లు చేసే పొరపాట్లు.. ఆ వ్యవస్థపై ఆరోపణలు, విమర్శలకు దారి తీశాయి.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సహా విపక్షాలు తీవ్రస్థాయిలో వాలంటీర్‌ వ్యవస్థపై ధ్వజమెత్తారు. తాజాగా న్యూఇయర్‌ వేడుకల సందర్భంగా మరోసారి ఓ వాలంటీర్‌ వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీసింది.. కృష్ణా జిల్లాలోని మోపిదేవి మండలంలో నూతన సంవత్సర వేడుకల్లో ఓ వాలంటీర్ దాష్టీకం ప్రదర్శించాడు. మండలంలోని పెదప్రోలు గ్రామస్తులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుండగా.. అక్కడ వాలంటీర్ సుధాకర్ రెచ్చిపోయాడు. డీజే వివాదంలో గ్రామస్తులపై దాడికి పాల్పడ్డాడు.. మహిళలపై విచక్షణారహితంగా దాడి చేసినట్టు మండిపడుతున్నారు స్థానికులు..

Read Also: Asaduddin Owaisi: రామమందిరంపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు..

పెదప్రోలు గ్రామంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న వారిపై కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడ్డాడు గ్రామ వాలంటీర్ సుధాకర్.. ఇక, వాలంటీర్‌కు తోడుగా వచ్చిన మరో నలుగురు యువకులు కూడా రెచ్చిపోయారు.. మహిళలను కర్రలతో కొడుతూ, పొత్తి కడుపులో పిడిగుద్దులు గుద్దారు.. అయితే, తమపై జరిగిన దాడిని, వాలంటీర్‌ వ్యవహారాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా.. వారు పట్టించుకోలేదని.. ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు.. మరోవైపు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలతో పాటు.. గ్రామంలో బాధితులను తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రామ్ పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు.