ఈజీమనీకోసం ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. నిరుద్యోగుల బలహీనతే పెట్టుబడిగా జరిగిన ఘరానా దోపిడీ విశాఖలో వెలుగులోకి వచ్చింది. భారీ జీతాలు….ఉన్నతమైన ఉద్యోగాలు పేరుతో వల వేసి చేసిన పక్కా మోసం ఇది. ఫిర్యాదులు వెల్లువలా వస్తుండటంతో సీఐడీ రంగంలోకి దిగింది. స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ అవకతవకల తీగలాగితే ఇప్పుడు డొంకంతా కదులుతోంది. స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ.. ఈ పేరు చెబితే ఏపీలో వేలాది మంది నిరుద్యోగులు ఉలిక్కిపడుతు న్నారు. పుట్టి పెరిగిన ప్రాంతంలోనే మంచి ఉద్యోగం….ఐదు అంకెల జీతం అంటే నిజమని నమ్మారు. ఒకరిని చూసి ఒకరు….ఆ జిల్లా…ఈ జిల్లా అని లేదు ప్రతీ చోట పెద్ద ఎత్తున చేరారు.
ఫర్మ్ పేరులో స్మార్ట్ ఉంచుకుని….రాజకీయ పెద్దలతో పరిచయాలు పెంచుకున్న వ్యక్తి అంతరంగం పసిగట్ట లేకపోయారు నిరుద్యోగులు. ఫలితం ఉత్తరాంధ్ర కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ స్కామ్ విస్తరించింది. అదే స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ. ఉద్యోగం పేరుతో ఈ సంస్థ ఘరానా మోసం చేసిందని బాధితులు పోలీస్ స్టేషన్లకు క్యూకట్టారు. చాలా చోట్ల కేసులు నమోదయ్యాయి.ఫిర్యాదులు వెల్లువలా వస్తుండటంతో సీఐడీ రంగంలోకి దిగింది. స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ సీఎండీ ఇండిపూడి సుధాకర్ ను అనకాపల్లిలో అదుపులోకి తీసుకుంది. విచారణ కోసం విశాఖలోని రీజినల్ సీఐడీ కార్యాలయంకు తరలించింది. సుధాకర్ సీఐడీ అదుపులో ఉన్నాడని తెలుసుకున్న బాధితులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. తొలిరోజు 25 మంది బాధితులు దగ్గర వాంగ్మూలం నమోదు చేసింది సీఐడీ.
Read Also: Thieves in Hyder Guda: హైదర్ గూడలో దొంగల హల్ చల్.. బంగారు, నగదుతో మాయం
స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ తీగలాగితే పెద్ద డొంకే కదిలేలా కనిపిస్తోంది. అనకాపల్లికి చెందిన ఇండిపూడి సుధాకర్ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. 2018 అక్టోబర్ లో నర్సీపట్నం కేంద్రంగా స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీని స్ధాపించాడు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా తమ సంస్ధ పనిచేస్తున్నట్టు ప్రకటించుకున్నాడు సుధాకర్. గ్రామాలు, స్కూళ్లలో సోషల్ వర్క్ చేస్తూ జనానికి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరిజిల్లాలకు కార్యకలాపాలు విస్తరించాయి. భారీగా ఉద్యోగాల భర్తీ, ఆకర్షణీయమైన జీతాలు ప్రకటించి నిరుద్యోగ యువతకు ఆఫర్ ఇచ్చాడు సుధాకర్. ఈ నెట్ వర్క్ ఏ స్థాయిలో పెరిగిందంటే నాలుగైదేళ్ల కాలంలో స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ ఉద్యోగుల సంఖ్య దాదాపు 9వేల వరకు వుంటుందని సమాచారం. స్కూళ్ళు, అంగన్ వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు, పనితీరుపై డేటా సేకరించే బాధ్యతను వీళ్ళందరికీ అప్పగించారు. కొన్ని నెలలుగా చాకిరీ చేయించుకోవడం తప్ప పైసా ప్రయోజనం లేకపోవడంతో బాధితులు రోడ్డెక్కారు.
స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ పుట్టిన నర్సీపట్నంలోనే ఆ సంస్ధ ఎండీ సుధాకర్ పై ఫిర్యాదులు రాగా కేసులు నమోదయ్యాయి. సంస్ధలో ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, జిల్లా ఏవో పోస్టులు వున్నాయని, నెలకు 15నుంచి 25వేలు జీతంగా చెల్లిస్తామని నమ్మబలికింది. ఇందు కోసం డిపాజిట్ రూపంలో ఒక్కొక్కరి దగ్గర నుంచి 1.5లక్షల నుంచి మూడు లక్షల వరకు వసూలు చేశాడు. నియామక పత్రాలు ఇవ్వగా అవన్నీ నకిలీవని గుర్తించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో చాలా జిల్లాల నుంచి బాధితులు బయటకు వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులను నట్టేట ముంచిన ఆరోపణలపై స్మార్ట్ యోజన స్కామ్ విచారణ కు సీఐడీ రంగంలోకి దిగడం ఆసక్తికరమైన పరిణామంగా చెప్పాలి. సీఐడీ విచారణకు రంగంలోకి దిగిన క్రమంలో స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీలో అసలు ఏం జరిగింది…!!.కోట్లాది రూపాయలు నిధులు ఎక్కడకు వెళ్లాయనే దిశగా సీఐడీ విచారిస్తోంది.
Read Also: Kim Jong Un: వందేళ్లు ఆంక్షలు పెట్టినా.. అణ్వాయుధాలను విడనాడం