విశాఖ కలెక్టరేట్లో ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య కోల్డ్ వార్ బజారుకెక్కింది. డీఆర్వో భవానీ ప్రసాద్, ఆర్డీవో శ్రీలేఖ మధ్య విభేదాలు తారాస్ధాయికి చేరాయి. ఇంట్లోకి కావాల్సిన నెలవారీ సరకుల కోసం డీఆర్వో భవానీ ప్రసాద్ ఇండెంట్లు పెడుతున్నారని కలెక్టర్‌కు ఆర్డీవో శ్రీలేఖ ఫిర్యాదు చేశారు. ఉప్పు, పప్పు, చింతపండు సహా ఆఖరికి బట్టలు ఆరే సుకునే క్లిప్పుల వరకు ఈ జాబితాలో ఉన్నాయని కోట్ చేశారు. ఇలా వేలకు వేలు తహాశీల్ధార్లపై ప్రతీ నెల ఒత్తిడి చేయడం వల్ల ఇబ్బందికరమైన పరిస్ధితులు ఎదురౌతున్నాయని, అవినీతికి ఆస్కారం కలుగుతుందని రాతపూర్వకంగా కంప్లయింట్ చేశారు.
Also Read: iPhone 17 Pro Offers: దీపావళి సేల్.. ఐఫోన్ 17 ప్రోపై బంపర్ డిస్కౌంట్!
ఈ లేఖ బహిర్గతం కావడంతో అంతర్గత వ్యవహారాలు వెలుగు చూశాయి. డీఆర్వోపై ఆర్డీవో చేసిన కంప్లయింట్ రాష్ట్రంలో కలకలం సృష్టించింది. ఇటీవల ఆర్డీవో శ్రీలేఖకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పెందుర్తిలో అంబేడ్కర్ విగ్రహం తరలించే సమయంలో నిబంధనలు పాటించలేదని ఫిర్యాదులు అందాయి. వీటిపై సంజాయిషీ ఇవ్వాలని ఆర్డీవోను కలెక్టర్ ఆదేశించారు. ఈ వ్యవహారం తర్వాత డీఆర్వోపై ఆర్డీవో కంప్లయింట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ పంచాయితీ అమరావతికి చేరగా అధికార పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.