విశాఖ గర్జనకు సాగరతీరం సిద్ధమయింది. మూడు రాజధానుల నినాదంతో అధికార వైసీపీ ముందుకెళుతోంది. అమరావతి రైతుల పాదయాత్రకు కౌంటర్ గా విశాఖలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో మన విశాఖ – మన రాజధాని అనే నినాదంతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధే లక్ష్యమంటూ జేఏసీ ఈ గర్జన సభను నిర్వహిస్తోంది. రాష్ర్ట అభివృద్ధిలో మూడు రాజధానుల పాత్ర ఎంతో కీలకమనేది వైసీపీ ప్రభుత్వం భావన..
ఇప్పుటికే సంక్షేమంలో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్న ఏపీ ప్రభుత్వం.. వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెబుతోంది. రాష్ర్టంలోని ఒక ప్రాంతాన్ని కాకుండా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని.. అది మూడు రాజధానుల ద్వారానే సాధ్యమవుతుందనేది వైసీపీ వాదన. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వైసీపీ మఖ్యనేతలంతా విశాఖలోనే మకాం వేసి ఈ సభను విజయవంతం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఉత్తరాంధ్ర, విశాఖ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకునే విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించామని వైసీపీ చెబుతోంది.
ఇదిలా వుంటే.. ఇవాళ టీడీపీ కూడా సమావేశం నిర్వహిస్తోంది.విశాఖలో నేడు తెలుగుదేశం పార్టీ ‘సేవ్ ఉత్తరాంధ్ర’ సదస్సు….మూడేళ్లలో ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించనుంది నాయకత్వం. అమరావతి అభివృద్ధికి ఉత్తరాంధ్ర ప్రజలేమీ అడ్డు పడడం లేదని, అలాంటప్పుడు పాదయాత్ర చేస్తున్నవాళ్లు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎందుకు మోకాలడ్డుతున్నారని జేఏసీ నేతలు ప్రశ్నిస్తున్నారు.విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన. మూడు రోజుల పర్యటన నిమిత్తం మధ్యాహ్నం రెండు గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్ కి చేరుకోనున్నారు. దీంతో వైజాగ్ హాట్ సెంటర్ గా మారింది.
-
అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే విశాఖ గర్జన
అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే విశాఖ గర్జన అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్... అందరి రాజధాని కావాలో కొందరి రాజధాని కావాలో ప్రజలు ఆలోచించాలని సూచించారు.. రెండు లక్షల కోట్ల రూపాయలు ఒక్క అమరావతి కోసమే ఖర్చుచేయాలా? అని ప్రశ్నించారు మార్గాని భరత్
-
అన్ని ప్రాంతాల అభివృద్దికి మూడు రాజధానులు-వైవీ సుబ్బారెడ్డి
విశాఖ గర్జనలో పాల్గొన్నవారందరికీ నమస్కారాలు.. విశాఖ పాలనా రాజధానిగా ఉండాలని జగన్ భావించారు. అన్ని ప్రాంతాలు సర్వతోముఖాభివృద్ధి చెందాలన్నారు.అమరావతి లో కోట్ల రూపాయలు దోచుకోవాలని చంద్రబాబు టీం భావించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా మూడురాజధానులు వచ్చి తీరతాయన్నారు. విశాఖలోనే పాలన సాగిస్తారు. పాదయాత్ర పేరుతో దండయాత్ర చేస్తున్న వారిని తరిమి తరిమి కొట్టాలి. వారిని నిలదీయాలి. మా ప్రాంతంలో పాలనా రాజధాని వస్తే ఎందుకు అడ్డుకుంటున్నారు. జేఏసీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
-
ఉత్తరాంధ్రది ఉక్కు సంకల్పం-విడదల రజిని
ఉత్తరాంధ్ర ప్రజలు ఉగ్రరూపం దాల్చారు. విశాఖ గర్జన కోసం జనం ఉప్పెనలా వచ్చారు. ఉక్కు సంకల్పంతో జనం పోటెత్తారు. మూడురాజధానులకు మద్దతుగా నిలిచారు. విశాఖకు పాలనా రాజధాని కావాలని వారి మనోభావాలను తెలుసుకునేందుకు ఈ గర్జన నిర్వహించాం. అప్పుడు మద్రాస్, తర్వాత హైదరాబాద్ రాజధాని అంటే ఉత్తరాంధ్ర ప్రజలు ఓకే అన్నారు. ఇక్కడ రాజధాని రావాలని జనం భారీగా తరలివచ్చారు. రాలేని వారు టీవీల ముందు కూర్చున్నారు. మా వెనుకబాటు తనాన్ని పోగొట్టుకుంటామని మీరంతా వచ్చారు. ఈప్రాంతానికి మంచి జరగాలని జగన్ భావిస్తున్నారు. అమరావతి పేరుతో ఇక్కడికి వచ్చి ఏం సంకేతాలు ఇస్తారు.
-
ఈ ప్రాంతం అభివృద్ది చెందడం పవన్ కి ఇష్టం లేదు.. రోజా
జై ఉత్తరాంధ్రకు నేను మద్దతిస్తున్నా అంటే జగన్ ఎజెండా ఎలాంటిదో అర్థం చేసుకోవాలి. చంద్రబాబు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. ఆయన అభివృద్ధి చేయకుండా అత్యాశతో దోచుకోవడం వల్ల మన ప్రాంతాలు వెనుకబడి పోయాయి. మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని జగన్ భావించారు. అభివృద్ధి వికేంద్రీకరణకు 26 జిల్లాల ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు. అమరావతి పెయిడ్ ఆర్టిస్టులను సపోర్ట్ చేసిన వారిని తరిమి తరిమి కొట్టాలి. ఈ ప్రాంతం అభివృద్ది చెందడం పవన్ కి ఇష్టం లేదు. ఉత్తరాంధ్రకు ఆయన అన్యాయం చేశారు. పవన్ కి అంతా తెలిసి పోయింది. అమరావతికి అన్యాయం చేయడం లేదు. తన బినామీల కోసం, తన బ్రీఫ్ కేసులు పోతాయని, రైతుల ముసుగులో పోరాటం చేస్తున్నారు. వాళ్లు చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం.. మనం చేసేది ఏపీ స్టేట్ కోసం పోరాటం అన్నారు మంత్రి రోజా
-
వానను లెక్కచేయలేదు... స్పీకర్ తమ్మినేని
ఎంత జడివాన కురిసినా జనం లెక్కచేయలేదు. పాలనా పరమయిన వివక్ష. ఒకనాటి ఉద్యమాలకు పోరుగడ్డలు ఉత్తరాంధ్ర జిల్లాలు. ముక్తి కోసం, భుక్తి కోసం ఉద్యమాలు ఇక్కడ జరిగాయి. మహిళలు కూడా ఉద్యమం చేశారు. ఆనాడు ఎంతోమంది త్యాగం చేశారు. తాము పోయినా మన భావితరాలు బాగుపడాలన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు రాకూడదు. కర్నూలు, అమరావతి, విశాఖను డెవలప్ చేయాలని భావించారు జగన్. మూడు రాజధానులు చేస్తే సర్వతోముఖాభివృద్ధికి తీసుకున్న నిర్ణయం ఇది. మూడురాజధానులను వద్దనేవారిని కడిగేయాలి. వారిని నిలదీయాలి.
-
ఉత్తరాంధ్రపై చంద్రబాబుకి ప్రేమ లేదు. నాని
తన మనుషులు కోసం చంద్రబాబు చూస్తారు. ఈ ప్రాంతం గురించి ఆలోచించరు. అమరావతి రాజదానిని గ్రాఫిక్స్ లో చూపించారు. విశాఖను అభివృద్ధి చేస్తే లక్షలమందికి మంచి ఉపాధి లభిస్తుంది. అమరావతి మాత్రమే కావాలనుకునేవారికి కుక్కకాటుకి చెప్పుదెబ్బలా ఆయా పత్రికలను, టీవీలను బహిష్కరించాలి. ఇంత వానలో విశాఖ గర్జనకు వచ్చిన వారికి ధన్యవాదాలు.
-
మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి..నాని
మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి. రాబోయే తరాల్లో ప్రాంతీయ విద్వేషాలు రాకూడదు. రాష్ట్రాలు విడిపోయే ప్రమాదం ఉంది. గతంలో రాజధాని ఒకటే వుండడం వల్ల అభివృద్ధి ఒకచోట కేంద్రీకృతం అయింది. వర్షంలోనూ ప్రజలు తమ ఆకాంక్షలను చాటారు. ఒక ప్రాంతమే అభివృద్ధి చెందకూడదు. సీఎం జగన్ మూడు ప్రాంతాల అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు, పవన్ కి ఒకటే బాధ.. అమరావతి ఒకటే కావాలా? ఉత్తరాంధ్రలో టీడీపీ లేదా? ఈ ప్రాంతంలో పవన్ సినిమాలు రిలీజ్ చేయడం లేదా? అమరావతిలో వేల కోట్లతో భూములు కొన్నారు.
-
జోరు వానలోనూ కొనసాగుతున్న విశాఖ గర్జన ర్యాలీ
విశాఖ గర్జన ర్యాలీ జోరు వానలోనూ కొనసాగుతోంది. 3 కిలోమీటర్లకు పైగా సాగే ఈ యాత్రను నాన్ పొలిటికల్ జేఏసీ నిర్వహిస్తుండగా.. అధికార వైసీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఇందులో పాల్గొన్నారు. ర్యాలీ పెద్ద ఎత్తున కొనసాగుతోంది. అమరావతి వద్దు, రియల్ ఎస్టేట్ రాజధాని వద్దు.. మూడురాజధానులు ముద్దు అంటూ బెలూన్లతో ర్యాలీ కొనసాగుతోంది.
-
అనూహ్యమయిన మద్దతు
విశాఖ గర్జనకు ఊహించిన దానికంటే అనూహ్యమైన మద్దతు లభించిందని నాన్ పొలిటికల్ జె.ఏ.సీ. అంటోంది. వేలాది మంది జై విశాఖ నినాదాలు చేస్తుండగా ర్యాలీ స్టార్ట్ అయింది. భారీ వర్షం వల్ల కొంత ఆటకం కలిగించినా జనం మాత్రం హుషారుగా ముందుకు కదులుతున్నారు. జనం జాతరగా మారంది గర్జన ప్రాంగణం.
-
విజయనగరం నుంచి విశాఖకు ర్యాలీ
విశాఖ గర్జనకు సమర శంఖం పూరించిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి, డిప్యూటీ సీఎం రాజన్న దొర...విశాఖకు బయలుదేరిన ర్యాలీని ప్రారంభించిన డిప్యూటీ సీఎం రాజన్నదొర... కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాస్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, సర్పంచులు జిల్లా స్థాయి నాయకులు...కార్లతో భారీ ర్యాలీగా విజయనగరం నుంచి విశాఖపట్నంకు బయలుదేరిన నాయకులు..
-
విశాఖ గర్జనలో సకల మత ప్రార్థనలు
మూడురాజధానులకు సకల విఘ్నాలు తొలగాలని సకల మత ప్రార్థనలు నిర్వహించారు. భారీ ఎత్తున తరలి వచ్చిన జనంతో ర్యాలీ ఉత్సాహంగా సాగుతోంది. నాన్ పొలిటికల్ జేఏసీ నేతలు సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. వైసీపీ, ప్రజాసంఘాలు ఈ విశాఖ గర్జన ర్యాలీకి మద్దతు ఇవ్వడంతో భారీగా జనసమీకరణ చేశారు. జై విశాఖ.. జైజై విశాఖ అంటూ నినాదాలు సాగుతున్నాయి.
-
టీడీపీ-జనసేనకు ఉత్తరాంధ్ర ఇప్పుడు గుర్తొచ్చిందా?
టీడీపీ-జనసేన పార్టీలపై మంత్రులు అమర్నాథ్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. విశాఖ గర్జన భయంతో ఇప్పుడు టీడీపీ- జనసేనకు ఉత్తరాంధ్ర గుర్తుకు వచ్చింది. విశాఖ గర్జన విజయవంతం ఖాయం. విశాఖ రాజధాని అవకాశాన్ని వదులుకునే పరిస్థితుల్లో ప్రజలు లేరు’ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ‘ఉత్తరాంధ్రలో ఉన్న వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకే విశాఖ పరిపాలన రాజధాని. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞతతో ఒక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ పరిపాల రాజధానిగా ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. విశాఖ గర్జనకు విశేషమైన స్పందన లభిస్తోంది’ అని మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ తెలిపారు.
ఇక వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘పాదయాత్ర పేరుతో దండయాత్ర చేస్తున్న వారికి కనువిప్పు కలగాలని విశాఖ గర్జన ర్యాలీ. వర్షం వచ్చినా విశాఖ గర్జన ర్యాలీ ఆగదు.వర్షం కంటే ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మస్థైర్యం గొప్పది. ఉత్తరాంధ్రకు టిడిపి నాయకులు ఏం చేశారో సమాధానం చెప్పాలి.రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను టిడిపి నేతలు దోచుకున్నారు.జేఏసీ ఏర్పాటు చేసిన తర్వాత ఉత్తరాంధ్ర పై టిడిపి నేతలకు ప్రేమ పుట్టుకొచ్చింది’ అని పేర్కొన్నారు.
-
విశాఖ గర్జన ర్యాలీ ప్రారంభం
విశాఖ: అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన జేఏసీ నేతలు,మంత్రులు.. అనంతరం విశాఖ గర్జన ర్యాలీ ప్రారంభం. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన స్పీకర్, సుబ్బారెడ్డి,మంత్రులు బొత్స,రజని,జోగిరమేష్,రోజా,నాగార్జున.అంబేద్కర్ సర్కిల్ నుంచి పార్క్ హోటల్ వైఎస్సార్ విగ్రహం వరకూ ర్యాలీ కొనసాగనుంది. రాజకీయాలకతీంగా భారీ ప్రదర్శన చేపట్టగా దీనికి అన్ని వర్గాల నుంచి విశేషమైన మద్దతు లభిస్తోంది. ఈ మేరకు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని వివరిస్తూ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. తరతరాల వెనుకబాటు తనంపై ఒక్కటైన ఉత్తరాంధ్ర ప్రజానీకం వికేంద్రకరణతోనే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని నినదిస్తున్నారు.
-
టీడీపీ,జనసేనలపై మంత్రి రోజా ఫైర్
విశాఖ గర్జన ప్రాంగణానికి చేరుకున్న మంత్రి ఆర్ కె రోజా విపక్షాలపై మండిపడ్డారు. టీడీపీ,జనసేనలపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. మూడు ప్రాంతాల అభివృద్ధిని కోరుకుంటున్న మమ్మల్ని పిచ్చి కుక్కలు అని టీడీపీ అంటోంది...వికేంద్రీకరణను అడ్డుకుంటున్న అచ్చెన్నాయుడు వంటి టీడీపీ వాళ్లే గజ్జికుక్కలు.. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ బినామీ.....చంద్రబాబు ఎప్పుడు సమస్యల్లో వున్నా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతారు.....కలెక్షన్లు, షూటింగ్ లు, కంటెస్టు చెయ్యడానికి వైజాగ్ కావాలి కానీ రాజధానిగా పనికి రాదా...? అన్నారు.
-
విశాఖ గర్జన ప్రాంగణానికి మంత్రులు
విశాఖ గర్జన సభా ప్రాంగణానికి చేరుకున్న టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి...మంత్రులు బొత్స, విడుదల రజిని, జోగి రమేష్, రోజా, బుగ్గన, కారుమూరి నాగేశ్వరరావు, వైసీపీ ఎమ్మెల్యేలు. నేతలు
-
ఆటపాటలతో హోరెత్తిస్తున్న కళాబృందాలు
విశాఖను రాజధానిగా చేయాలంటూ ఆటపాటలతో హోరెత్తిస్తున్నాయి కళాబృందాలు. పోరాటంతోనే పరిపాలన రాజధాని సాధ్యమని ఉత్తరాంధ్ర గర్జిస్తోంది. కళాకారుల ఆటపాటలతో హోరెత్తిస్తున్నారు. ఏం పిల్లడో ఎలదమోస్తవ అంటూ కదంతొక్కుతున్నారు. దీంతో విశాఖ గర్జన ప్రాంతమంతా కోలాహలంగా ఉంది.
-
వికేంద్రీకరణకు మద్దతుగా బైక్ ర్యాలీ
వికేంద్రీకరణకు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. దక్షిణ నియోజకవర్గం నుంచి వందలాది వాహనాలతో తరలివచ్చిన యువకులు ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా నినాదాలు చేశారు. మరోవైపు వికేంద్రీకరణ పోరాటానికి ఉత్తరాంద్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. మూడు రాజధానుల జెండాలు పట్టుకుని గర్జనలో భాగస్వామ్యం అవుతున్నాయి. ఉత్తరాంద్ర అభివృద్ధే ఉద్యమ నినాదం అంటున్నాయి ఉద్యోగ సంఘాలు.
-
విశాఖ రాజధాని కావాలి
శ్రీకాకుళం జిల్లా నుంచి భారీ ఎత్తున ప్రజలు విశాఖకు తరలివస్తున్నారు. విశాఖ పరిపాలన రాజధాని కావాలంటూ విశాఖ లో జరిగే విశాఖ గర్జనకు 20 కార్లతో బయలు దేరిన రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు.
-
విశాఖ రాజధానికే మా మద్దతు
విశాఖను పరిపాలనా రాజధానిగా పెట్టాలని డిమాండ్ చేస్తూ టెక్కలి ఎం ఎల్ సి ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా విశాఖ ఘర్జనకు టెక్కలి నుండి బయలుదేరారు వైకాపా శ్రేణులు, అభిమానులు.
-
బీచ్ రోడ్డులో భారీ బహిరంగసభకు ఏర్పాట్లు
విశాఖ: బీచ్ రోడ్డులో భారీ బహిరంగసభకు ఏర్పాట్లు.. అమరావతికి మేం వ్యతిరేకం కాదంటున్న మంత్రులు.. దక్షిణ కోస్తా, రాయలసీమ నుంచి తరలివస్తున్న నేతలు.. వర్షం పడుతున్నా కొనసాగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు
-
విశాఖ గర్జన వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు
ఒకవైపు వర్షం. మరో వైపు విశాఖ గర్జన వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మంత్రి అమర్నాథ్ చేతులూపి ఉత్సాహం కలిగేలా చేస్తున్నారు.
-
విశాఖ గర్జన ర్యాలీ ఎలా సాగుతుందంటే..
విశాఖ నగరం హోర్డింగులతో కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న ‘విశాఖ గర్జన’ ర్యాలీ కాసేపట్లో ఎల్‌ఐసీ బిల్డింగ్.. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి ప్రారంభం కానుంది. జైలు రోడ్డు జంక్షన్, సెవెన్ హిల్స్ హాస్పిటల్ జంక్షన్, వాల్తేర్ క్లబ్, సిరిపురం జంక్షన్, చిన వాల్తేర్ జంక్షన్ మీదుగా ఆర్‌కే బీచ్ రోడ్డులోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు సుమారు మూడున్నర కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ముందుగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి ఉత్తరాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జేఏసీ సభ్యులు, ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, మేధావులు నివాళులర్పించి.. ర్యాలీ ప్రారంభిస్తారు.
-
విశాఖ గర్జనకు చేరుకుంటున్న మంత్రులు
విశాఖ గర్జనకు చేరుకుంటున్నారు మంత్రులు.. విశాఖగర్జన స్టార్టింగ్ పాయింట్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కి చేరుకున్న మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. వేదిక పైన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. ఆటపాటలతో, విచిత్ర వేషధారణతో అలరిస్తున్నారు.
-
విశాఖలో మోస్తరు వర్షం
విశాఖ గర్జన స్టార్టింగ్ పాయింట్ ఎల్ ఐ సి బిల్డింగ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర వర్షం పడుతోంది. ట్రాఫిక్ డైవర్ట్ లను పరిశీలిస్తున్నారు పోలీసులు. నాన్ పొలిటికల్ జే ఏ సి సభ్యులు విశాఖ గర్జన కి ఏర్పాట్లు చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో విశాఖలో గడిచిన కొన్ని రోజులుగా వర్సాలు కురుస్తున్నాయి. అయితే ఈరోజు వర్షం వచ్చినా విశాఖ గర్జన యధావిధిగా నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. ముందస్తు వర్ష సూచన నేపథ్యంలో జేఏసీ నేతలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. గొడుగులు, రెయిన్ కోట్లతో కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. వర్షం వచ్చినా తగ్గేది లేదంటున్నారు వైసీపీ నేతలు. భారీ జనసమీకరణకు రెడీ అయ్యారు నేతలు. ఉదయం నుంచి జనాన్ని విశాఖ తరలిస్తున్నారు.
-
ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు
విశాఖ గర్జన ర్యాలీ కోసం వందలాది వాహనాల్లో తరలిరానున్నారు ఉత్తరాంధ్ర జనం. విశాఖ రీజియన్ పరిధిలో అద్దెకు వెళ్ళాయి 250 ఆర్టీసీ బస్సులు. వీటికి తోడు వందల సంఖ్యలో ఆటోలు, ఇతర వాహనాలు విశాఖ గర్జన ర్యాలీకి రానున్నాయి. గర్జనకు వచ్చే వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు.ఉదయం 9 గంటలకు విశాఖ గర్జన ర్యాలీ ప్రారంభంకానుంది. విశాఖను పరిపాలన రాజధాని చేయాలని కోరుతూ ర్యాలీ చేపట్టనున్నారు. ర్యాలీలో జేఏసీ నేతలతో పాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు. ప్రజలు భారీ ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.