Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?

Ganesh Idol Protest

Ganesh Idol Protest

Visakhapatnam Ganesh Idol Protest: విశాఖలో వినాయకుడు నిరసనకు దిగాడు?. మనుషులకే కాదు దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా?.. అన్నట్టే వినూత్న రీతిలో విగ్రహం ఏర్పాటు చేసి పూజలు అందిస్తున్నారు భక్తులు. విశాఖపట్నంలో వినాయక చవితి 2026 సందర్భంగా చేపట్టిన ఈ వినూత్న నిరసన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నీటి ఎద్దడి, డేటా సెంటర్ల కారణంగా భవిష్యత్‌లో ఎదురయ్యే ఇబ్బందులను తెలియజేసేందుకు వినాయకుడి విగ్రహాన్నే నిరసనకు ప్రతీకగా ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

జీవీఎంసీ గాంధీ పార్క్ సమీపంలో ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలకు తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో భారీగా నీటిని వినియోగించే డేటా సెంటర్లకు అనుమతులు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో స్థానిక నీటి వనరులపై పడే భారాన్ని ప్రజలకు వివరించేందుకు ఈ తరహా నిరసన చేపట్టినట్లు తెలిపారు. నీటి వనరులపై ఇప్పటికే ఒత్తిడి పెరుగుతున్న సమయంలో కొత్తగా భారీ నీటి అవసరాలు కలిగించే ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం సరైన నిర్ణయం కాదని ట్రేడ్ యూనియన్లు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజల తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశాయి.

ప్రజలకు తాగునీరు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు డేటా సెంటర్ల అవసరాల కోసం నీటిని కేటాయించడం వల్ల భవిష్యత్‌లో సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ట్రేడ్ యూనియన్లు పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం, అధికారులు తక్షణమే స్పందించి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలతో పాటు నిరసన చేపట్టడం ద్వారా నీటి సమస్యపై ప్రజల్లో చర్చ జరగాలని, డేటా సెంటర్ల వల్ల కలిగే పర్యావరణ, నీటి వనరులపై ప్రభావాలపై అవగాహన పెరగాలని ట్రేడ్ యూనియన్లు ఆకాంక్షించాయి. ఈ వినూత్న నిరసన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.