NTV Telugu Site icon

Child Trafficking Racket: శిశు విక్రయాల కేసులో సంచలన విషయాలు

Vizag Cp

Vizag Cp

Child Trafficking Racket: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న శిశు విక్రయాల కేసులో అంతరాష్ట్ర ముఠా ఉన్నట్లు విశాఖ సిటీ పోలీసులు గుర్తించారు. పిల్లలను ఎత్తుకెళ్లి లక్షల రూపాయలకు అమ్ముతున్న ముఠాలు దేశం అంతా నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఢిల్లీ, ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో ఈ ముఠా ఉన్నట్లు విశాఖ సీపీ శంకబ్రత బాగ్చి తెలిపారు. ఇప్పటి వరకు 17 మంది నిందితులను అరెస్టు చేసి ఆరుగురు పిల్లలను రెస్క్యూ చేశామని సీపీ వెల్లడించారు. ఈ కేసు లోతుల్లోకి వెళితే అనేక మంది చిన్నారులు అపహరణకు గురవడం వంటి ఘటనలు వస్తున్నాయని సీపీ చెప్పారు. ఆసుపత్రుల్లో, క్లినిక్‌లలో ఇలాంటి నేరాలు చేసిన అనుభవం వున్న వాళ్లే నిందితులుగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ఆరు కారణాలతో పిల్లల అమ్మకాలు జరుగుతున్నాయని.. డిమాండ్ ఆధారంగా పిల్లలను ఎత్తుకెళ్లి అమ్ముతున్నట్టు తేల్చారు.

Read Also: Andhra Pradesh: కలుషితాహారం తిని విద్యార్థుల మృతి.. రూ.10 లక్షల పరిహారం

కొన్ని కేసుల్లో బంధువులు, తల్లిదండ్రులు భాగస్వామ్యం వుండటం మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. కొద్దిరోజుల క్రితం సిరిపురం ఏరియాలో చిన్నారిని అమ్మకానికి పెట్టినట్టు టాస్క్ ఫోర్స్‌కు సమాచారం లభించింది. దీని ఆధారంగా రైడ్ చేస్తే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. సుమారు 8 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకున్నట్టు గుర్తించారు. ఈ కేసు విచారణలో ఉండగానే శిశు విక్రయ మాఫియా మూలాలను కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించితే కీలక ఆధారాలు లభ్యం అయ్యాయి. వరుస ఘటనలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. కేజీహెచ్, ఘోషా ఆసుపత్రి సహా ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర నిఘా పెంచారు. సిటీ పరిధిలోని 80 ఆసుపత్రులలో లోపాలను గుర్తించారు. తల్లీ బిడ్డల రక్షణకు అవసరమైన ఏర్పాట్లలో వైఫల్యాలను సరిదిద్దాలని, సెక్యూరిటీ పరంగా తీసుకోవాలని జాగ్రత్తలు పాటించడం లేదని నిర్ధారణ అయింది. చైల్డ్ మిస్సింగ్ కేసులతో పాటు వివిధ ఆసుపత్రుల నుంచి అపహరణకు గురైన వాటి మొత్తం క్రోడీకరించి ఒక లాజికల్ కన్‌క్లూజన్‌కు రావాలనేది పోలీసుల ఆలోచన.