NTV Telugu Site icon

Virender Sehwag: ఆర్యవీర్‌.. తృటిలో ఫెరీరా కారు మిస్ అయ్యావ్: సెహ్వాగ్

Aryavir Sehwag

Aryavir Sehwag

టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ తనయుడు ఆర్యవీర్‌ భారీ ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. కూచ్‌ బెహర్‌ ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడుతూ.. మేఘాలయాపై డబుల్‌ సెంచరీ చేశాడు. 229 బంతుల్లో 34 ఫోర్లు, 2 సిక్సులతో 297రన్స్ బాదాడు. మైదానం నలువైపులా మెరుపు షాట్లు ఆడిన ఓపెనర్‌ ఆర్యవీర్‌.. ట్రిపుల్‌ సెంచరీ ముంగిట తడబడ్డాడు. ట్రిపుల్‌ సెంచరీకి కేవలం మూడు పరుగుల దూరంలో ఆగిపోయాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఆర్యవీర్‌పై ప్రశంసల వర్షం కురిసింది.

తన కొడుకు ఆర్యవీర్‌ 23 పరుగుల తేడాతో ఫెరారీ కారు మిస్‌ అయ్యాడని వీరేంద్ర సెహ్వాగ్‌ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. టెస్టుల్లో వీరూ అత్యధిక స్కోరు 319 అన్న విషయం తెలిసిందే. ఆ స్కోరును దాటేందుకు జూనియర్ వీరూ 23 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. తన అత్యధిక స్కోరు అధిగమిస్తే.. ఫెరారీ కారు కొనిస్తానని ఆర్యవీర్‌కు సెహ్వాగ్‌ మాట ఇచ్చాడు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపారు. ‘ఆర్యవీర్‌ బాగా ఆడావ్. ఫెరీరా కారును 23 పరుగుల తేడాతో కోల్పోయావు. ఇదే పరుగుల దాహంను మున్ముందు కొనసాగించు. భారీ సెంచరీలు కొట్టాలి. ఫెరీరా కారును నా నుంచి నువ్ త్వరలోనే తీసుకుంటావ్ అనుకుంటున్నా’ అని వీరూ రాసుకొచ్చారు.

Also Read: Jasprit Bumrah: నా మొగుడు గొప్ప బౌలర్.. సంజనా ఫన్నీ కామెంట్! నవ్వుకోవాల్సిందే

గత అక్టోబర్‌లో వినూ మన్కడ్‌ ట్రోఫీలో ఆర్యవీర్‌ అరంగ్రేటం చేశాడు. అండర్‌-19 వన్డే తొలి మ్యాచ్‌లో మణిపుర్‌పై 49 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వీరేంద్ర సెహ్వాగ్ మాదిరే ఆర్యవీర్‌ కూడా ఓపెనర్. తండ్రి బాటలోనే నడుస్తూ.. ఇన్నింగ్స్ ఆదినుంచే బౌలర్లను ఉతికారేస్తున్నాడు. ఆర్యవీర్‌ బ్యాటింగ్ చూస్తుంటే అంతర్జాతీయ క్రికెట్లోకి త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సెహ్వాగ్ భారత్ తరఫున 104 టెస్టులు, 251 టెస్టులు, 19 టీ20లు ఆడారు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 38 సెంచరీలు బాదారు.