Virat Kohli not to big score in Bangladesh match: కెరీర్‌లో ఎన్నడూ లేనివిధంగా మూడేళ్ల పాటు ఫామ్ లేమితో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సతమతం అయిన విషయం తెలిసిందే. అడపాదడపా హాఫ్ సెంచరీలు చేసినా.. తన స్థాయికి తగ్గ ప్రదర్శన మాత్రం చేయలేదు. ఎట్టకేలకు 2022లో మళ్లీ ఫామ్ అందుకున్నాడు. ఆసియా కప్ 2022లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన టీ20లో సెంచరీ చేశాడు. దాంతో మూడేళ్ల సెంచరీ కరువును తీర్చుకున్నాడు. ఆపై టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్థాన్‌పై సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత వన్డేలు, టెస్టుల్లో తన ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ.. సెంచరీలు బాదాడు.
2023లో అయితే విరాట్ కోహ్లీ ఊపు మామూలుగా లేదు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో వెయ్యి పరుగులు చేయగా.. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. ఆసియా కప్ 2023లో పాకిస్థాన్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో కోహ్లీ శతకంతో చెలరేగాడు. దాంతో శ్రీలంకలోని ప్రేమదాస స్టేడయంలో వరుసగా నాలుగో సెంచరీ బాదాడు. ప్రేమదాస స్టేడయంలో అద్భుత రికార్డు ఉన్న కోహ్లీ.. లంకపై కూడా శతకం చేస్తాడని అందరూ భావించారు. అయితే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ దునిత్ వెల్లలెగె వేసిన బంతిని నేరుగా ఫీల్డర్‌కు కొట్టి పెవిలియన్ చేరాడు. దాంతో కోహ్లీ బ్యాటింగ్‌లో ఉన్న అతిపెద్ద బలహీనత ఇదేనంటూ చాలా మంది విమర్శలు చేశారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో కోహ్లీ తెగ ఇబ్బంది పడుతున్నాడని, బంగ్లాదేశ్‌పై కూడా తడబడటం ఖాయమని కొందరు సోషల్ మీడియాలో అంటున్నారు.
Also Read: Virat Kohli Fan Girl: విరాట్ కోహ్లీకి గిఫ్ట్ ఇచ్చిన శ్రీలంక యువతి.. వీడియో వైరల్!
బంగ్లాదేశ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ షకీబల్ హసన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ తడబడటం ఖాయం అని జోస్యం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా స్పందించాడు. సుదీర్ఘమైన క్రికెట్ కెరీర్ ఆటగాళ్లు ఏదో ఒక తరహా బౌలర్లకు ఎక్కువ సార్లు అవుట్ అవ్వడం సహజమేనని పేర్కొన్నాడు. ‘విరాట్ కోహ్లీ ఆడినన్ని మ్యాచులు ఆడితే ఎవరో ఒకరి బౌలింగ్‌లో ఎక్కువ సార్లు అవుటవడం సహజమే. లంకపై కోహ్లీ అవుట్ అయిన తీరు సింపుల్‌గా ఉన్నా.. అది అతడు ఎక్కువగా ఆడే షాట్. పిచ్ నుంచి బంతి అనుకున్నంత వేగంగా రాకపోవడంతో అవుటయ్యాడు. కోహ్లీకి ఎడం చేతి వాటం బౌలర్లను ఎదుర్కోవడం పెద్ద సమస్య అయితే.. అతను 47 సెంచరీలు చేసే వాడు కాదు’ అని చావ్లా పేర్కొన్నాడు.