NTV Telugu Site icon

RCB Bowlers: విరాట్ కోహ్లీనే తక్కువ రన్స్ ఇస్తాడేమో.. ఆర్‌సీబీపై శ్రీకాంత్ సెటైర్లు!

Krishnamachari Srikkanth on RCB Bowlers: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) బౌలర్లు స్థాయికి తగ్గట్టుగా రాణించడం లేదు. ప్రతి మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ముఖ్యంగా చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌)తో జరిగిన మ్యాచ్‌లో భారీగా పరుగులు ఇచ్చారు. ఎంతలా అంటే ఆర్‌సీబీ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ.. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లు 287 రన్స్ చేశారు. దాంతో ఆర్‌సీబీ బౌలింగ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆర్‌సీబీ బౌలింగ్‌పై భారత మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్‌సీబీ విజయం సాధించాలంటే 11 మంది బ్యాటర్లే ఉండాలని, విరాట్‌ కోహ్లీతో బౌలింగ్‌ చేయిస్తే ఉత్తమమని క్రిష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ… ‘రీస్ టోప్లీను బాదేశారు. లాకీ ఫెర్గూసన్‌ను కూడా హడలెత్తించారు. ఐపీఎల్‌లో ఈ ఇద్దరు పెద్దగా రాణించలేదు. కోల్‌కతా నుంచి బెంగళూరుకు ఫెర్గూసన్‌ వచ్చినా.. ప్రయోజనం లేకుండా పోయింది. ప్రస్తుతం విల్‌ జాక్స్‌ అత్యుత్తమ బౌలర్. బెంగళూరు 11 మంది బ్యాటర్లతో బరిలోకి దిగడం బెటర్. ఫాఫ్ డుఫ్లెసిస్‌ రెండు ఓవర్లు, కామెరూన్ గ్రీన్‌ 4 ఓవర్లు వేయాలి’ అని అన్నారు.

Also Read: T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో ఓపెనర్లుగా రోహిత్, కోహ్లీ.. రియాన్ పరాగ్‌కు ఛాన్స్!

‘విరాట్ కోహ్లీ మంచి బౌలర్. రెగ్యులర్ బౌలర్ల కంటే అతడే తక్కువ పరుగులు ఇస్తాడని నేను భావిస్తున్నా. విరాట్ గతంలో బాగా బౌలింగ్‌ చేశాడు. కాబట్టి కోహ్లీ నాలుగు ఓవర్లు వేయాలి. చిన్నస్వామి స్టేడియంలో విరాట్‌ను చూస్తుంటే బాధేసింది. బంతి బౌండరీ, స్టాండ్స్‌లోకి వెళ్తుంటే వాటిని నిరాసక్తిగా చూస్తూ ఉండిపోయాడు. ట్రావిస్ హెడ్‌, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్‌ సమద్ తమ బౌలింగ్‌ను ఓ ఆటాడుకోవడంతో విరాట్ తట్టుకోలేకపోయాడు’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ చెప్పారు. ఐపీఎల్‌ 2024లో బెంగళూరు ఏడు మ్యాచులు ఆడి ఒక్క విజయంతో పట్టికలో అట్టడుగున ఉంది. ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే.. ఇకపై ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ బెంగళూరు విజయం సాధించాల్సిందే. ఒక్క మ్యాచ్ ఓడినా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.