బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భారత్ శుభారంభం చేసింది. బౌలర్లతో పాటు బ్యాటర్లు విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ సెంచరీలతో చెలరేగారు. సుదీర్ఘ టెస్ట్ సిరీస్‌లో విరాట్ మొదటి టెస్టులోనే ఫామ్ అందుకోవడంతో.. టీమిండియా ఫాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ తమ జట్టు వ్యూహాలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. విరాట్ పెర్త్ టెస్ట్ ముందు వరకు పెద్దగా రన్స్ చేయలేదని, అతడిపై మరింత ఒత్తిడి తీసుకొచ్చి కట్టడి చేసేందుకు ఆసీస్ ప్రయత్నించి ఉండాల్సిందని క్లార్క్ అన్నాడు. ఇక కోహ్లీని ఆపడం కష్టమే అని తమ జట్టును హెచ్చరించాడు.
మైకెల్ క్లార్క్ మాట్లాడుతూ… ‘రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడం గొప్ప విషయం, అంతకంటే అత్యుత్తమం మరేదీ ఉండదు. తొలి ఇన్నింగ్స్‌లో ఎక్కువగా పరుగులు చేయని విరాట్ కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌లో క్రీజ్‌లోకి వచ్చే సమయానికి కాస్త ఒత్తిడితోనే ఉన్నాడు. భారత్ జట్టు పరంగా ఆధిపత్యం ప్రదర్శిస్తున్నా.. విరాట్ మాత్రం ఎక్కువగా పరుగులు చేయలేదు. ఆ సమయంలో మరింత ఒత్తిడి తీసుకొచ్చి అతడిని కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా ప్రయత్నించాలి. ఒక్కసారి కోహ్లీ పరుగులు చేయడం ప్రారంభిస్తే.. అతడిని ఆపడం చాలా కష్టం’ అని అన్నాడు.
Also Read: Smriti Mandhana: స్మృతీ మంధానతో రిలేషన్‌ను అందుకే గోప్యంగా ఉంచా: పలాష్
‘పెర్త్ టెస్టుకు ముందు విరాట్ చాలా శ్రమించాడు. ఇన్నింగ్స్ ముగిశాక విరాట్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు అని అందరూ ప్రశంసించారు. స్టార్ బ్యాటర్లను ఎప్పుడూ తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేయనివ్వకూడదు. 4, 5 టెస్టులో సెంచరీ చేస్తే పెద్దగా ఏమీ కాదు. మొదటి టెస్టులోనే సెంచరీ చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మిగతా టెస్టుల్లో కూడా పరుగులు చేస్తారు. ఇప్పుడు కోహ్లీ ని ఆపేందుకు ఆసీస్ తీవ్రంగా శ్రమించాలి. ఇప్పుడు కోహ్లీ చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. గత కొన్నేళ్లుగా అత్యుత్తమ బ్యాటర్‌గా ఉండేందుకు కారణం అదే. ఒక్కసారి పరుగులు చేయడం మొదలు పెడితే.. ఆపడు’ అని మైకెల్ క్లార్క్ చెప్పుకొచ్చాడు. గత కొన్ని టెస్టుల్లో విరాట్ పెద్దగా పరుగులు చేయని విషయం తెలిసిందే.