Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!

Virat Kohli Sachin

Virat Kohli Sachin

Virat Kohli: టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మళ్లీ మైదానంలోకి దిగి తన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. చాలా రోజుల నుంచి కోహ్లీని భారత జెర్సీలో చూడటానికి అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే వారి నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. సెప్టెంబర్ 27 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కాబోతోంది. ఈ సిరీస్‌లో విరాట్ తన బ్యాట్ పవర్‌ను చూపించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే టెస్టులు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ, తన దృష్టినంతటినీ వన్డే ఫార్మాట్‌పైనే పెట్టాడు. గతంలో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో చివరిసారిగా కనిపించిన విరాట్, 2027 వన్డే వరల్డ్ కప్‌కు ముందు మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకోవడానికి ఈ వెస్టిండీస్ సిరీస్ మంచి అవకాశం కానుంది. ఈ క్రమంలో ఆయన ముందు కొన్ని భారీ రికార్డులు వేచి చూస్తున్నాయి.

వన్డే క్రికెట్‌లో విరాట్ కోహ్లీ 15,000 పరుగుల మైలురాయికి అత్యంత సమీపంలో ఉన్నాడు. ఇప్పటివరకు 302 ఇన్నింగ్స్‌ల్లో 58.59 సగటుతో 14,941 పరుగులు సాధించాడు. ఈ అద్భుతమైన మార్కును చేరుకోవడానికి విరాట్‌కు కేవలం మరో 59 పరుగులు మాత్రమే కావాలి. ఈ రికార్డు సాధిస్తే ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలో 15 వేల పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం అతడి కంటే ముందు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (18,426 పరుగులు) మాత్రమే ఉన్నారు.

అంతేకాదు, ఈ సిరీస్‌లో సచిన్ టెండూల్కర్‌కు చెందిన మరో భారీ రికార్డును కోహ్లీ బ్రేక్ చేసే అవకాశం ఉంది. భారత్‌లో ఇప్పటివరకు 130 వన్డేలు ఆడిన విరాట్, 62.42 సగటుతో 6,867 పరుగులు చేశాడు. ప్రస్తుతం మన దేశంలో అత్యధిక వన్డే పరుగులు చేసిన రికార్డు సచిన్ (6,976 పరుగులు) పేరిట ఉంది. సచిన్ ఆల్ టైమ్ రికార్డును దాటాలంటే విరాట్‌కు ఈ సిరీస్‌లో మరో 110 పరుగులు అవసరం. ఇది సాధిస్తే సొంతగడ్డపై వన్డేల్లో అత్యంత విజయవంతమైన బ్యాటర్‌గా కోహ్లీ నిలుస్తాడు.

దీంతో పాటు మరొక రేర్ రికార్డ్ కూడా విరాట్‌ ముంగిట ఉంది. వన్డేల్లో ఏకైక ప్రత్యర్థి జట్టు (శ్రీలంక)పై 10 సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా కోహ్లీకి ఇప్పటికే రికార్డు ఉంది. ఇక వెస్టిండీస్‌పై కూడా అతడి ఖాతాలో ప్రస్తుతం 9 వన్డే సెంచరీలు ఉన్నాయి. ఈ సిరీస్‌లో గనుక విరాట్ మరో సెంచరీ చేస్తే, రెండు వేర్వేరు జట్లపై 10 లేదా అంతకంటే ఎక్కువ వన్డే సెంచరీలు బాదిన ప్రపంచంలోనే మొదటి క్రికెటర్‌గా నిలిచి ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు.