టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ర్యాంకింగ్స్‌లో మూడు ఫార్మాట్‌లలో 900+ రేటింగ్ పాయింట్స్ సాధించిన మొదటి ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఇప్పటికే టెస్ట్, వన్డే క్రికెట్‌లో 900 ప్లస్ రేటింగ్ పాయింట్స్ అందుకున్న కింగ్.. తాజాగా టీ20 క్రికెట్‌లో కూడా 900+ రేటింగ్ పాయింట్స్ సాధించాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో విరాట్ 909 రేటింగ్ పాయింట్స్ సాధించాడు. 897 రేటింగ్ పాయింట్స్ నుంచి 909కి చేరుకున్నాడు. దాంతో కింగ్ ఆల్‌టైమ్ రికార్డ్ నెలకొల్పాడు.
టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత పొట్టి ఫార్మాట్‌కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ తరఫున 125 అంతర్జాతీయ టీ20లు ఆడిన కోహ్లీ.. 48.69 సగటు, 137.04 స్ట్రైక్‌రేట్‌తో 4188 రన్స్ చేశాడు. ఇందులో 38 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ ఉంది. టీ20 క్రికెట్‌లో విరాట్ కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్స్ 909. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్ట్ క్రికెట్ కింగ్ వీడ్కోలు పలికాడు. 123 టెస్టుల్లో 46.35 సగటుతో 9230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ బెస్ట్ రేటింగ్ పాయింట్స్ 937.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. 302 వన్డేల్లో 57.9 సగటుతో 14181 రన్స్ చేశాడు. 51 సెంచరీలతో వన్డే ఫార్మాట్‌లో అత్యధిక శతకాలు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. మూడు ఫార్మాట్‌లలో 900 ప్లస్ రేటింగ్ పాయింట్స్ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రెండు ఫార్మాట్ల నుండి రిటైర్ అయిన తర్వాత కింగ్ ఈ రికార్డు నెలకొల్పడం విశేషం. దాంతో విరాట్ కోహ్లీ ఫాన్స్ సంబరపడిపోతున్నారు.
Also Read: PV Sindhu: కొనసాగుతున్న పీవీ సింధు వైఫల్యం.. ఈ ఏడాదిలో అయిదో సారి!
బహుశా విరాట్ కోహ్లీ నెలకొల్పిన ఈ రికార్డు మరో ఆటగాడికి సాధ్యం కాదేమో?. ఎందుకంటే.. ఈ కాలంలో మూడు ఫార్మాట్‌లలో ఆడే ప్లేయర్స్ చాలా తక్కువ. అందులోనూ అన్ని ఫార్మాట్‌లలో రాణించాలంటే పెను సవాలే. దిగ్గజం జో రూట్ టెస్ట్, వన్డే ఫార్మాట్‌లలో రాణించినా.. పొట్టి ఫార్మాట్ రికార్డు పేలవంగా ఉంది. కేన్ విలియంసన్, స్టీవ్ స్మిత్ సైతం అంతే. సూర్యకుమార్ యాదవ్ పొట్టి ఫార్మాట్‌లలో 909 రేటింగ్ పాయింట్స్ అందుకున్నా.. వన్డే ఫార్మాట్‌లో నిలకడ లేదు, టెస్ట్ ఫార్మాట్‌లో చోటే లేదు. ఇక కింగ్ అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో ఆడనున్నాడు.