Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!

  • కేకేఆర్‌పై అద్భుత సెంచరీతో ఫామ్‌లోకి తిరిగొచ్చిన విరాట్ కోహ్లీ
  • వరుసగా రెండు డకౌట్ల తర్వాత కోహ్లీపై వచ్చిన విమర్శలకు ఘన సమాధానం
  • కోహ్లీతో కలిసి “100” సంకేతంతో ఫొటో పోస్ట్ చేసిన కృనాల్ పాండ్యా
  • “I told you so” అంటూ వైరల్ క్యాప్షన్ ఇచ్చిన కృనాల్..
Virat Kohli Century

Virat Kohli Century

Virat Kohli Century: విరాట్ కోహ్లీ (Virat Kohli) మరోసారి తన క్లాస్‌ను చూపించాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన తర్వాత తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కోహ్లీ, కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై అద్భుత సెంచరీతో ఘనంగా తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అతడి ఈ ఇన్నింగ్స్ జట్టుకు కీలక విజయాన్ని అందించింది. ఇక మ్యాచ్ అనంతరం ఆర్‌సీబీ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. కోహ్లీతో కలిసి “100” సంకేతాన్ని చేతులతో చూపిస్తూ ఫొటో పోస్ట్ చేసిన కృనాల్, “I told you so” (నేనే చెప్పాను కదా..) అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కోహ్లీ తిరిగి భారీ ఇన్నింగ్స్ ఆడతాడని తాను ముందే చెప్పానని ఆయన ఆ పోస్టుతో గుర్తుచేశాడు.

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ వరుసగా రెండో డకౌట్ నమోదు చేసిన తర్వాత కూడా కృనాల్ అతడిపై పూర్తి నమ్మకం వ్యక్తం చేశాడు. ఆయన మాట్లాడుతూ.. “విరాట్ కోహ్లీ ఓ ఛాంపియన్ ప్లేయర్. అతడు రెండు మ్యాచ్‌ల్లో విఫలమైతే నాకు ఇంకా ఎక్కువ ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే అతడు బలంగా తిరిగి వస్తాడని నాకు తెలుసు. కోహ్లీ గురించి మాకు ఎలాంటి టెన్షన్ ఉండదు” అని వ్యాఖ్యానించాడు. ఇకపోతే ఈ మ్యాచ్‌లో కోహ్లీ పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 14 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. అలాగే టీ20ల్లో 10 సెంచరీలు చేసిన తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ రన్‌ చేజ్‌ లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో జోస్ బట్లర్ సరసన చేరాడు.

మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన RCB ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీనితో మొదట బ్యాటింగ్ చేసిన KKR నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అంగ్‌క్రిష్ రఘువంశీ 71 నాటౌట్, రింకూ సింగ్ 49 నాటౌట్‌తో జట్టును ఆదుకున్నారు. లక్ష్య ఛేదనలో ఆర్‌సీబీకి ఆరంభంలోనే జేకబ్ బెథెల్ వికెట్ కోల్పోయినా, కోహ్లీ-దేవదత్ పడిక్కల్ జోడీ కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. పడిక్కల్ 39 పరుగులు చేయగా, చివర్లో కోహ్లీ తనదైన శైలిలో దూకుడుగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆర్‌సీబీ 19.1 ఓవర్లలో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించింది. మరోవైపు కేకేఆర్ ప్లేఆఫ్ అవకాశాలు ప్రమాదంలో పడ్డాయి. ఇక మిగిలిన మూడు మ్యాచ్‌లు వారికి కీలకంగా మారాయి.