Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

Viral Video

Viral Video

Viral Video: సామాన్యులకు తక్కువ ఖర్చులో సేఫ్ గా ప్రయాణించే మార్గం కేవలం రైలు మార్గమే. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది రైలు ప్రయాణం చేయడానికి సుముఖుత చూపుతారు. అయితే అప్పుడప్పుడు కొందరు వారు చేసే చిన్న తప్పిదాల వల్ల అనేకమంది ప్రాణాలను పోగొట్టుకున్నారు రైలు ప్రయాణాలలో. మరికొందరు ఆ ప్రమాదాలనుంచి బయట పడుతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

బంగ్లాదేశ్‌ లోని కిషోరేగంజ్ జిల్లాలో గుండెల్లో దడ పుట్టించే ఘటన వెలుగులోకి వచ్చింది. భైరబ్ రైల్వే స్టేషన్ వద్ద ఒక తండ్రి తన ఏడాది వయసున్న చిన్నారిని ప్రాణాలకు తెగించి కాపాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఏప్రిల్ 28న మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో చోటుచేసుకుంది. టిటాస్ కమ్యూటర్ రైలు ఢాకా వైపు వెళ్తున్న సమయంలో.. రైలు ఆలస్యంగా స్టేషన్‌కు చేరుకుంది. కుటుంబం రైలులో నుంచి దిగేందుకు ప్రయత్నించేలోపే రైలు మళ్లీ కదలడం ప్రారంభమైంది.

ఈ క్రమంలో తండ్రి తన చిన్నారిని చేతిలో పట్టుకుని త్వరగా దిగేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ తొందరలో చిన్నారి అతని చేతుల నుంచి జారి రైలు, ప్లాట్‌ఫామ్ మధ్యనున్న గ్యాప్‌లో పడిపోయింది. ఈ దృశ్యం చూసిన తండ్రి క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే కిందికి దూకాడు. తన చిన్నారిని గట్టిగా కౌగిలించుకుని ప్లాట్‌ఫామ్ అంచు కింద గోడకు అతుక్కుని పడుకున్నాడు. ఆ సమయంలో రైలు బోగీలు వారి మీదుగా వెళ్లిపోయినా.. అదృష్టవశాత్తూ ఇద్దరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ సంఘటనతో అక్కడ ఉన్న వారందరినీ షాక్‌కు గురి చేసింది.

రైలు పూర్తిగా వెళ్లిపోయిన తర్వాత స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని తండ్రి, చిన్నారి పరిస్థితిని తెలుసుకున్నారు. చిన్నారి తల్లి కూడా ట్రాక్‌ పైకి దిగి తన బిడ్డను కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ఘటనలో ఇద్దరూ సురక్షితంగా బయటపడటం అందరికి ఊరట కలిగించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో, తండ్రి ధైర్యసాహసాలను ప్రశంసిస్తున్నారు. ఈ సంఘటన రైలు ప్రయాణాలలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది.