Tirumala: వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు వీఐపీలు క్యూ కడుతున్నారు. సుప్రింకోర్టు నుంచి 7 మంది, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి 35 మంది న్యాయమూర్తులు వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తిరుమలకు ఏపీకి చెందిన ముగ్గురు మంత్రులు, ఏపీ అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ చేరుకున్నారు. ఇవాళ రాత్రికి తిరుమలకు మరో 12 మంది మంత్రులు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ రానున్నారు. ఐదు మంది టీటీడీ పాలక మండలి సభ్యులు తిరుమలలోనే మకాం వేశారు. రాత్రికి మరో 18 మంది సభ్యులు చేరుకోనున్నారు. వారే కాకుండా తిరుమలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్యూ కడుతున్నారు. చాలా మంది వీఐపీలు తిరుమలకు వస్తుండటంతో వారికి వీఐపీ వసతి గదులు కేటాయించలేకు రిసెప్షన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో వసతి గదుల కోసం టీటీడీపై ఒత్తిడిగా పెరుగుతున్నట్లుగా తెలిసింది.
Read Also: Balakrishna: రంగంలోకి దిగిన బాలయ్య.. రెండు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటన
ఇదిలా ఉండగా.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల వరకు క్యూలెన్ పెరిగిపోయింది. సర్వదర్శనం క్యూలైన్‌లోకి భక్తులకు అనుమతిని నిలిపివేశారు. క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవారి దర్శనానికి నేటి అర్ధరాత్రి పట్టే అవకాశం ఉంది. రేపటి నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో టోకెన్ కలిగిన భక్తులకే ద్వారదర్శనానికి టీటీడీ అనుమతి ఇచ్చింది. మరోవైపు.. సర్వదర్శనం భక్తులుకు టోకెన్ల కేటాయింపు కొనసాగుతోంది. ప్రస్తుతం 26వ తేదీకి సంబంధించిన దర్శన టోకెన్లు టీటీడీ కేటాయిస్తోంది.