దేశ వ్యాప్తంగా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో గెలిచినందుకు విజయోత్సవాలు జరుపుకున్నారు. ఈ క్రమంలో.. మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలోని మోహోలో భారీ గందరగోళం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి విజయోత్సవాల సందర్భంగా జరిగిన ర్యాలీలో కొందరు దుండగులు రాళ్ల దాడి చేసి బైకులు, కార్లను తగలబెట్టారు. ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పటివరకు 13 మందిని అరెస్టు చేశారు. వారిలో కొందరిపై జాతీయ భద్రతా చట్టం (NSA) కింద కేసులు నమోదు చేశారు.
Read Also: Minister Kandula Durgesh: రుషికొండ బీచ్లో మళ్లీ బ్లూఫ్లాగ్ జెండాను ఎగరవేస్తాం..
కాగా.. ఆదివారం రాత్రి నుంచి మోహోలో జిల్లా యంత్రాంగం, పోలీసు బృందాలు మోహరించి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. దుండగులను నియంత్రించడానికి పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు.. అంతేకాకుండా కొందరిపై లాఠీ ఛార్జ్ కూడా చేశారు. ఈ సంఘటనలో గాయపడిన కొంతమందిని ఇండోర్‌లోని ఎంవై ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆశిష్ సింగ్ మాట్లాడుతూ.. “నిన్నటి సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, మేము సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని నియంత్రించాం. మొదట శాంతి నెలకొల్పడమే మా లక్ష్యం, మేము అందులో విజయం సాధించాము. ప్రస్తుతం, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. 13 మందిని అరెస్టు చేసి, వారిపై NSA చట్టం కింద చర్యలు తీసుకున్నాం” అని తెలిపారు.
Read Also: Posani Krishna Murali: పోసాని క్వాష్ పిటిషన్లపై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ విజయం సాధించిన సందర్భంగా మోహోలో అభిమానులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. అయితే.. జామా మసీదు సమీపంలో అకస్మాత్తుగా ఒక వర్గం రాళ్ల దాడి ప్రారంభించింది. ఆ తర్వాత రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్ల దాడితో పాటు కొన్ని వాహనాలకు నిప్పటించారు. పోలీసులు అక్కడున్న సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా.. గుర్తు తెలియని వ్యక్తుల బృందం ముఖానికి ముసుగులు ధరించి, కర్రలు పట్టుకుని రాళ్ళు విసురుతూ కనిపించింది.