NTV Telugu Site icon

Kidney Rocket Case: విజయవాడ కిడ్నీ రాకెట్ కేసు.. నలుగురు నిందితులు అరెస్ట్

Kidney Rocket

Kidney Rocket

Kidney Rocket Case: విజయవాడ కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ వ్యవహారంలో మొత్తం నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కార్తీక్, నాగమణి, తమ్మిశెట్టి వెంకయ్య, కనక మహాలక్ష్మీ అనే నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వెస్ట్ ఏసీపీ హనుమంతరావు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలే టార్గెట్‌గా ఈ ముఠా కిడ్నీ రాకెట్ ను నడిపిందని వెల్లడించారు. విజయవాడలో చోటు చేసుకున్న రెండు కేసులో వీరు నిందితులుగా ఉన్నారని ఏసీపీ తెలిపారు.ఈ క్రమంలోనే ఒక్కో కేసులో రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు డీల్ కుదుర్చుకుని కిడ్నీ విక్రయాలు సాగిస్తున్నట్లు తెలిపారు.

Also Read: Andhrapradesh: అడవుల పరిరక్షణలో ఆంధ్రప్రదేశే ఆదర్శం.. అటవీ సంరక్షణ బిల్లుపై విజయసాయి రెడ్డి

కిడ్నీ మార్పిడి రాకెట్‌లో కీలకమైన కార్తీక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నీ మార్పిడిలో మొత్తం 29 లక్షలకు డీల్ సెట్ చేశాడు. కిడ్నీ డోనర్‌కు రూ.7.50 లక్షలు, ఇతరులకు రూ.21.50 లక్షలు ఇచ్చేలా.. కిడ్నీ రిసీవర్ దీపక్ రెడ్డితో మీడియేటర్ కార్తీక్ డీల్ కుదుర్చుకున్నాడు. గతంలో బాబురావు అనే మీడియేటర్ వద్ద కార్తీక్ అసిస్టెంట్‌గా చేశాడు. కిడ్నీని దీపక్‌కు ఇచ్చేందుకు కార్తీక్ ఒప్పందం చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. కార్తిక్ సహా మరో ముగ్గురిని పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు.

Also Read: AP High Court: అమరావతి అసైన్డ్ భూముల కేసు.. కీలక వాదనలు వినిపించిన సీఐడీ

విజయవాడ బాలభాస్కర్ నగర్‌కు చెందిన చిన్న అనే మహిళ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నల్లమిల్లి దీపక్ రెడ్డిని తన పెద్దనాన్న కొడుకుగా చూపి కిడ్నీ దానానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ఈ పత్రాలు నకిలీవిగా తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు తహసీల్దార్. గుంటూరు జిల్లాకు చెందిన మస్తాన్‌బీ కిడ్నీ దానం కోసం అనుమతివ్వాలని ఈ ఏడాది జూలై 24న విజయవాడ పశ్చిమ తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నారు. రామవరప్పాడులో నివాసం ఉండే సత్యవతికి కిడ్నీ దానం చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆధార్ కార్డులో పేరును కూడా మార్చుకున్నట్టుగా తమ దర్యాప్తులో వెల్లడైందని తహసీల్దార్ చెప్పారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నీ రాకెట్‌పై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ రెండు ఘటనల్లో కార్తీక్ కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహరంలో కీలక సూత్రధారి బాబూరావు పరారీలో ఉన్నాడు. గతంలో బాబురావు వద్దే కార్తీక్ పనిచేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉంటే.. పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో లక్ష్మి గతంలో తన కిడ్నీని విక్రయించినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. కిడ్నీ విక్రయించిన తర్వాత లక్ష్మి కిడ్నీ బ్రోకర్‌గా మారిందని పోలీసులు పేర్కొంటున్నారు.