Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..

Vizag Job Fraud

Vizag Job Fraud

విజయవాడలో విదేశాల్లో ఉద్యోగాల వీసాల పేరుతో నిరుద్యోగులను మోసగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికిన కేటుగాళ్లు, నిరుద్యోగుల నుంచి విడతల వారీగా సుమారు రూ. 50 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి బాధితులు విజయవాడ పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైలోని అమృత హోటల్ మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌లో ప్లేస్‌మెంట్ అధికారిగా పనిచేస్తున్న సమయంలో నరేష్ కుమార్‌తో వారికి పరిచయం ఏర్పడింది. అదే ఇనిస్టిట్యూట్‌లో చదువుకున్న రోజుల్లో నరేష్ కుమార్ చెప్పిన మాయమాటలను నమ్మి బాధితులు పూర్తిగా మోసపోయారు. ప్రస్తుతం నిందితుడు నరేష్ కుమార్ లయోలా కళాశాలలో పనిచేస్తున్నట్లు బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరుద్యోగుల ఉపాధి అవకాశాలను ఆసరాగా చేసుకుని నరేష్ కుమార్‌తో పాటు మరికొందరు కేటుగాళ్లు కలిసి ఎనిమిది మంది నుంచి విడతల వారీగా రూ. 50 లక్షలు వసూలు చేశారు.

చెన్నైకి చెందిన అరుణ్ కుమార్, ఉదయ్ కుమార్, సెంథిల్ కుమార్ తదితరుల బ్యాంకు ఖాతాలకు ఈ డబ్బులు ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసినట్లు బాధితులు తమ ఫిర్యాదులో స్పష్టం చేశారు. డబ్బులు వసూలు చేయడమే కాకుండా.. బాధితుల ఒరిజినల్ పాస్‌పోర్టులను కూడా బలవంతంగా తీసుకుని, వాటిని వెనక్కి ఇవ్వకుండా తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగుతున్నట్లు బాధితులు వాపోయారు.

ఉద్యోగాల కోసం తాము కష్టపడి సంపాదించిన లక్షలాది రూపాయలను కోల్పోవడమే కాకుండా.. పాస్‌పోర్టులు కూడా చేతిలో లేకపోవడంతో మానసిక ఆందోళన చెందుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ డబ్బులను, పాస్‌పోర్టులను ఇప్పించి న్యాయం చేయాలని కోరుతూ బాధితులు విజయవాడ సీపీకి లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను చట్టపరంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.