Budameru: బుడమేరుకు పడ్డ గండ్లను పూడ్చే పనులను యుద్ధప్రాతిపదికన చేస్తున్నాయి. బుడమేరు గండ్లను ఇవాళ పూడ్చేయాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. ఆర్మీ సాయంతో మూడో గండి పూడ్చివేత పనులను అధికారం ముమ్మరం చేశారు. గాబీయన్ బాస్కెట్ విధానంలో పనులు జరుగుతున్నాయి. ఇనుప జాలీల్లో రాళ్ళను నింపి గండి పూడ్చివేతకు పనులు జరుగుతున్నాయి. ఒక్కొక్కటి 522 మీటర్ల పరిమాణం గల గాబియన్ బాస్కెట్‌లను తొలుత ఒకదానిపై ఒకటి పేర్చి వాటిల్లో నింపి గండికి అడ్డుకట్టగా వేయనుంది. 100 మీటర్లు ఉన్న మూడో గండిలో 40 మీటర్లు నిన్ననే అధికారులు పూడ్చారు. ఇవాళ మిగతా 60 మీటర్లు పూడ్చటమే టార్గెట్‌గా పనులు జరుగుతున్నాయి. జలవనరుల శాఖ ఆధ్వర్యంలో గండిని పూడ్చే పనులను ఒకవైపు ఏజెన్సీలు చేస్తుంటే మరోవైపు ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగి పనులు చేస్తున్నారు. చెన్నైకి చెందిన 6వ బెటాలియన్, సికింద్రాబాద్‌కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు దాదాపు 120 మంది ఇక్కడికి వచ్చారు.
Read Also: Bandi Sanjay: తెలంగాణను అన్ని విధాలుగా ఆదుకోవడానికి ప్రయత్నిస్తాం..
ఇదిలా ఉండగా.. బుడమేరు మూడో గండి 90 శాతం పూర్తి అయిందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఇంకో రెండు గంటల్లో చంద్రబాబు కృషి ఫలించి బుడమేరు గండ్లు పూడిక పూర్తి అవుతుందని ఆయన వెల్లడించారు. మిగిలిన 10శాతం ఇంకో రెండు గంటల్లో పూర్తి చేసి సింగ్ నగర్ నుండి విజయవాడ వెళ్ళే వరదను పూర్తిగా నివారిస్తామన్నారు. నేటితో బుడమేరు వరద నుండి విజయవాడ ప్రజలకు విముక్తి కలిగిస్తామని మంత్రి తెలిపారు. విపత్తుతో వేలాది మంది పడుతున్న కష్టంతో పోల్చితే మాకష్టం ఎంత అంటూ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు.
కాగా, విజయవాడలో బుడమేరు వరద తగ్గుముఖం పట్టింది. బురద పట్టిన ఇళ్ళను ప్రజలు పరిశుభ్రం చేసుకుంటున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచీ ఇంటింటికీ వాహనాల ద్వారా నిత్యావసరాల పంపిణీ జరుగుతోంది.