VijayaSai Reddy: ఉగాది తర్వాత పాదయాత్ర.. విజయసాయి రెడ్డి కీలక ప్రకటన

Vijayasai Reddy

Vijayasai Reddy

VijayaSai Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉగాది పండుగ తర్వాత పాదయాత్ర చేపట్టనున్నట్లు పరివర్తన రాజనీతి పార్టీ (PRP) వ్యవస్థాపక అధ్యక్షుడు విజయసాయి రెడ్డి ప్రకటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న క్షేత్రస్థాయి సమస్యలను స్వయంగా తెలుసుకోవడం, వారి ఇబ్బందులను నేరుగా అర్థం చేసుకోవడమే ఈ పాదయాత్ర ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉగాది తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ గ్రామాలకు వెళ్లి ప్రజలను నేరుగా కలుస్తానని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వాటిపై దృష్టి సారిస్తానని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా టీడీపీ, వైఎస్సార్‌సీపీలపై విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై రెండు కుటుంబాల ఆధిపత్యం కొనసాగుతోందని, దీనివల్ల నిజమైన ప్రజా ప్రాతినిధ్యం అణచివేతకు గురవుతోందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సామాజిక న్యాయం, అణగారిన వర్గాల సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. కక్షపూరిత రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా యువత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని, కేవలం రాజకీయాలను చూస్తూ ఉండకుండా ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి ప్రవేశించాలని విజయసాయి రెడ్డి సూచించారు. యువత చట్టసభల్లో సభ్యులుగా ఎన్నికై ప్రజల గొంతుకను వినిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సామాజిక, రాజకీయ మార్పు తీసుకురావడంలో యువత కీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు పరివర్తన రాజనీతి పార్టీ (PRP) వ్యవస్థాపక అధ్యక్షుడు విజయసాయి రెడ్డి.