TVK vs DMK: స్టాలిన్‌కు ఆర్ఎస్ఎస్ యూనిఫామ్‌.. ‘సావర్కర్ 2.0’ అంటూ టీవీకే తీవ్ర విమర్శలు

Dmk Tvk

Dmk Tvk

TVK vs DMK: తమిళనాడు రాజకీయాలు (Tamil Nadu Politics) ఒక్కసారిగా వేడెక్కాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు (Delimitation Bill) మద్దతు ఇవ్వాలని డీఎంకే (DMK) నిర్ణయించుకోవడంపై నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ (Vijay) పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను (MK Stalin) ఏకంగా ‘సావర్కర్ 2.0’ (Savarkar 2.0) అని అభివర్ణిస్తూ టీవీకే ఐటీ వింగ్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించింది. ఆర్ఎస్ఎస్ (RSS) యూనిఫామ్‌లో స్టాలిన్ ఉన్నట్లు రూపొందించిన ఒక ఫోటోను ఎక్స్ (X) ఖాతాలో షేర్ చేస్తూ ఈ సెటైర్లు వేసింది.

కేవలం ‘సావర్కర్ 2.0’ అనడమే కాకుండా, “సనాతనం అల్లా… సన్-ధనం” అంటూ మరో పోస్ట్‌తో డీఎంకేపై టీవీకే వ్యంగ్యాస్త్రాలు సంధించింది. గతంలో ఇదే బిల్లును వ్యతిరేకించిన స్టాలిన్, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసమే యూ-టర్న్ తీసుకున్నారని టీవీకే ఆరోపిస్తోంది. పార్లమెంట్‌లో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని బహిరంగంగా ప్రకటించాలని టీవీకే గతంలోనే డీఎంకేకు సవాల్ విసిరింది. ఒకవేళ ఓటింగ్‌కు దూరంగా ఉన్నా, వాకౌట్ చేసినా అది బీజేపీకి (BJP) లొంగిపోవడమే అవుతుందని విమర్శించింది. అయితే, తన నిర్ణయాన్ని స్టాలిన్ గట్టిగా సమర్థించుకున్నారు. ఏప్రిల్‌లో తాము ఈ బిల్లును వ్యతిరేకించినప్పుడు లేవనెత్తిన రెండు ప్రధాన డిమాండ్లను కేంద్రం ఇప్పుడు లిఖితపూర్వకంగా అంగీకరించిందని స్టాలిన్ స్పష్టం చేశారు. 2024 నుంచి డీఎంకే చేస్తున్న నిరంతర పోరాటానికి, తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయంగా దీనిని అభివర్ణించారు. ప్రజలు భావోద్వేగాలకు లోనుకాకుండా ప్రశాంతంగా ఆలోచించాలని, ఈ ప్రతిపాదన ఆచరణాత్మకమైనది, రాష్ట్రానికి ప్రయోజనకరమైనది కావడం వల్లే మద్దతు ఇస్తున్నామని ఆయన ఎక్స్ వేదికగా వివరించారు.