Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..

Vijay Sethupathi

Vijay Sethupathi

Vijay Sethupathi: నటుడు విజయ్‌ సేతుపతి తాజాగా చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.. బిగ్‌బాస్ తమిళ్‌-10 షోలో విజయ్‌ సేతుపతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. ఓ కంటెస్టెంట్‌ నాయకత్వ శైలిపై మాట్లాడిన సేతుపతి.. హామీలు ఇవ్వడం, బాధ్యతలు స్వీకరించడం, కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడటం నాయకుడి లక్షణాలని వ్యాఖ్యానించారు. సమస్యలు వచ్చినప్పుడు తప్పించుకోవడం నాయకత్వం కాదని.. ప్రతిపక్షాన్ని నిందించడం మాత్రమే నాయకుడి లక్షణం కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే సేతుపతి ఎక్కడా ఏ రాజకీయ నాయకుడి పేరు కానీ.. పార్టీ పేరు కానీ ప్రస్తావించలేదు. అయినప్పటికీ ఆయన వ్యాఖ్యలను తమిళనాడు రాజకీయాలతో ముడిపెడుతూ సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. ముఖ్యంగా సీఎం విజయ్‌, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేశారంటూ ఇద్దరి అభిమానుల మధ్య వార్‌గా మారాయి… అయితే బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్‌ నాయకత్వంపై జరిగిన చర్చలో భాగంగానే సేతుపతి ఈ వ్యాఖ్యలు చేశారన్న కథనాలు కూడా ఉన్నాయి. గతంలో విజయ్‌ను ‘అన్నా’ అంటూ అభిమానించిన సేతుపతి.. మాస్టర్‌ సినిమా సమయంలోనూ విజయ్‌పై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరి అభిమాన వర్గాలు ఈ వ్యాఖ్యలను రాజకీయ వివాదంగా మార్చకుండా సంయమనం పాటించాలని పలువురు సూచిస్తున్నారు.