NTV Telugu Site icon

Minister Vidadala Rajini: ఎన్‌ఎంసీ కొత్త నిబంధనలు సడలించండి.. కేంద్రమంత్రికి విడదల రజినీ వినతి

Vidadhala Rajini

Vidadhala Rajini

జాతీయ వైద్య మండలి కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోందని, వాటిని సడలించి పాత పద్ధతి కొనసాగించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్‌ మాండవీయను కలిసి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రిని ఇవాళ (బుధవారం) మంత్రి విడదల రజిని కలిసి ఈమేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. ఎన్‌ఎంసీ కొత్తగా పలు నిబంధనలు తీసుకొచ్చిందని చెప్పారు. ప్రతి రాష్ట్రంలో ప్రతి పది లక్షల మంది జనాభాకు వంద సీట్లు చొప్పున మాత్రమే అనుమతి ఇచ్చేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చిందని ఆమె తెలిపారు.

Read Also: Chiyaan Vikram: ఆ డైరెక్టర్ తో విక్రమ్ కొత్త సినిమా..?

అయితే, కొత్త మెడికల్‌ కళాశాలలకు అనుమతి ఇవ్వాలంటే 605 పడకల సామర్ధ్యంతో ఆసుపత్రి కూడా ఉండాలని ఎన్‌ఎంసీ తాజాగా నిర్ణయించిందని మంత్రి విడదల రజినీ చెప్పారు. ఈ రెండు నిబంధనల వల్ల కొత్తగా ఏర్పడిన తమ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్‌లో టెర్షియరి కేర్ సర్వీసెస్ విషయంలో ఏపీ తీవ్రంగా నష్టపోయింది. దీనివల్ల ఏకంగా రూ. 8,480 కోట్లతో 17 కొత్త మెడికల్‌ కళాశాలలను సీఎం జగన్ నిర్మిస్తున్నారని వివరించారు. వీటిలో ఇప్పటికే 5 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయిందని పేర్కొన్నారు. మిగిలిన 12 కళాశాలల పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆమె తెలిపారు.

Read Also: Akkineni Nagarjuna : అక్కినేని నాగార్జున ఇంట తీవ్ర విషాదం.. సోదరి కన్నుమూత..

వచ్చే ఏడాది 5 కొత్త కళాశాలలు ప్రారంభం కాబోతున్నాయని, అందుకు సంబంధించి సిబ్బంది నియామకాలు కూడా పూర్తయ్యాయని మంత్రి విడదల రజినీ వివరించారు. కొత్త నిబంధనల వల్ల తమ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా కొత్తగా మంజూరయ్యే అవకామే ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య రంగంలో సీఎం జగన్ తీసుకొస్తున్న గొప్ప సంస్కరణలకు మీ వంతు సహకారం ఉండాలని, ఏపీకి ఆధునిక వైద్యం అందే విషయంలో ఎలాంటి నష్టం రాకుండా చొరవ తీసుకోవాలని కేంద్ర వైద్యఆరోగ్యమంత్రికి విడదల రజినీ వినతి పత్రం అందించారు. మంత్రి వినతికి సానుకూలంగా స్పందించిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్‌ మాండవీయ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.