బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై వైసీపీ మాజీ మంత్రి విడదల రజని తీవ్ర స్థాయిలో స్పందించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువత జీవితాలను పూర్తిగా నాశనం చేస్తోందని విడదల రజని ఆరోపించారు. డ్రగ్స్ నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. చివరికి వారి పార్టీ నేతలే, వారి కుమారులే డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు దొరకడం ప్రభుత్వ పాలనకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
Also Read: Atchutapuram Fire Accident: ఎస్వీఎస్ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం!
ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడటం అత్యంత సిగ్గుచేటని మాజీ మంత్రి విడదల రజని అన్నారు. ఎన్నికల సమయంలో వంద రోజుల్లో మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తోందని ప్రశ్నించారు. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరిగిందని, గంజాయి విక్రయాలు ఏకంగా 251 శాతం పెరిగాయని తెలిపారు. ఈ గణాంకాలే కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని చెప్పారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పని చేస్తోందా? అని నిలదీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని గాలికి వదిలేసి ఎక్కడో తిరుగుతున్నారని ఆరోపించారు. హోంమంత్రి ఉన్నారో లేదో కూడా ప్రజలకు తెలియని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. డ్రగ్స్ నియంత్రణలో కఠిన చర్యలు తీసుకోకపోతే యువత భవిష్యత్ పూర్తిగా నాశనం అవుతుందని హెచ్చరించిన మాజీ మంత్రి.. ప్రభుత్వం వెంటనే బాధ్యత తీసుకొని చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
