Pavala Shyamala: టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటి కన్నుమూత..!

Pavala Shyamala

Pavala Shyamala

Pavala Shyamala: తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ “పావలా శ్యామల” కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఆసుపత్రి వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జూలై 28 తెల్లవారుజామున సుమారు 1:52 గంటలకు ఆమెకు తీవ్రమైన గుండెపోటు రావడంతో మరణించారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. పావలా శ్యామల గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమెకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు గతంలో సహాయం అందించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఆమె చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ఇదిలా ఉండగా.. ఆమెతో కలిసి నివసిస్తున్న కుమార్తె కూడా ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఒకప్పుడు తన హాస్యభరితమైన, సహజమైన నటనతో వెండితెరపై ప్రేక్షకులను అలరించిన పావలా శ్యామల, చివరి రోజుల్లో ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో కన్నుమూయడం సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టింది. పావలా శ్యామల మృతిపట్ల సినీ ప్రముఖులు, అభిమానులు, పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.