NTR-Jamuna: మహానటుడు యన్.టి. రామారావు పేరు తలచుకోగానే అనితరసాధ్యంగా ఆయన పోషించిన శ్రీకృష్ణుని పాత్రనే ముందుగా తెలుగువారి మదిలో మెదలుతుంది. అదే తీరున జమున పేరు తలచుకోగానే ఆమె ధరించిన సత్యభామ పాత్ర జనానికి గుర్తు రాకుండా ఉండదు. అలా తెరపై శ్రీకృష్ణసత్యభామలుగా వెలిగి, జనం మదిలో నిలచిన యన్టీఆర్, జమున మధ్య అభినయ అనుబంధం ఉంది. గరికపాటి రాజారావు రూపొందించిన ‘పుట్టిల్లు’ చిత్రంతో జమున తెరకు పరిచయం అయ్యారు. అయితే యన్టీఆర్ చిత్రాలతోనే జమునకు మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. అంతకు ముందు “మా గోపి, బంగారుపాప” వంటి చిత్రాలలో జమున నటించినా, యన్టీఆర్ హీరోగా రూపొందిన ‘వద్దంటే డబ్బు’ చిత్రంలో మరో నాయికగా నటించిన జమునకు మంచి పేరు లభించింది.
యన్టీఆర్ తొలిసారి తెరపై శ్రీకృష్ణుని గెటప్ లోకనిపించిన చిత్రం ఎఫ్ నాగూర్ రూపొందించిన ‘ఇద్దరు పెళ్ళాలు’. ఇందులో ఓ డ్రీమ్ సాంగ్ గా రూపొందిన గీతంలో యన్టీఆర్ శ్రీకృష్ణునిగా, జమున గోపికగా నటించారు. వారిద్దరూ కలసి నటించిన ‘సంతోషం’ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలై విజయం సాధించింది. యన్టీఆర్ నటించిన సోషల్ మూవీ ‘నయా ఆద్మీ’ హిందీ చిత్రం కూడా ఇదే కావడం విశేషం! యన్టీఆర్ సరసన జమున నటించిన “సంతోషం, చిరంజీవులు, చింతామణి, భాగ్యరేఖ, సతీ అనసూయ, భూకైలాస్, గులేబకావళి కథ, మంచిమనిషి, రాముడు-భీముడు, మంగమ్మ శపథం, సి.ఐ .డి, శ్రీకృష్ణతులాభారం, తోడు-నీడ, అడుగు జాడలు, రాము, సంసారం, శ్రీకృష్ణవిజయం, శ్రీరామపట్టాభిషేకం, మనుషులంతాఒక్కటే, ఎవరు దేవుడు” వంటి చిత్రాలు అలరించాయి. అంతే కాకుండా యన్టీఆర్ తో కలసి “మిస్సమ్మ, గుండమ్మ కథ, అప్పుచేసి పప్పుకూడు, బొబ్బిలియుద్ధం,పల్నాటియుద్ధం” వంటి మరో పది చిత్రాలలోనూ ఆమె అభినయించారు. యన్టీఆర్ సరసన అత్యధిక చిత్రాలలో నటించిన నాయికగా జమున నిలచిపోయారు.
Jamuna Memories: తెలుగు సినిమాల్లో మరపురాని ‘జమునా’తీరం!
యన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్రం అనగానే అందరూ ‘రాముడు-భీముడు’ అనే చెబుతారు. అయితే అంతకు ముందే ‘సంతోషం’ చిత్రంలో ఓ సన్నివేశంలో రామారావు డ్యుయల్ రోల్ లోకనిపించారు. అటు ‘సంతోషం’, ఇటు ‘రాముడు-భీముడు’ రెండు చిత్రాలలోనూ జమున నాయిక కావడం విశేషం! కాగా, యన్టీఆర్ తొలిసారి తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘మంగమ్మ శపథం’. ఇందులో ఓ యన్టీఆర్ కు భార్యగా, మరో రామారావుకు తల్లిగా జమున తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు. అదే తీరున దాసరి నారాయణరావు తెరకెక్కించిన ‘మనుషులంతా ఒక్కటే’లోనూ యన్టీఆర్ కు భార్యగా, తల్లిగా నటించి అలరించారు జమున.
యన్టీఆర్ సొంత చిత్రాలలోనూ జమున తగిన పాత్రలు ధరించి మెప్పించారు. యన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన ‘గులేబకావళి కథ, శ్రీరామపట్టాభిషేకం’ చిత్రాలలో జమున నటించారు. యన్టీఆర్ ను సదా భోళా మనిషి అనేవారు. కల్లాకపటం లేకుండా చిన్నపిల్లాడి వంటి మనసు అని చెప్పేవారు. రాజకీయాల్లో మాత్రం యన్టీఆర్ ను విభేదించారు. యన్టీఆర్ అధికారంలోకి రాగానే కళాకారుడై ఉండి సాంస్కృతిక శాఖను రద్దు చేయడం పట్ల ఆమె తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 1983లో కాంగ్రెస్ టిక్కెట్ పై మంగళగిరి శాసనసభకు పోటీచేస్తూ యన్టీఆర్ ను తీవ్రపద జాలంతో విమర్శించారు. ఆ ఎన్నికల్లో జమున ఓటమి చవిచూశారు. తరువాత 1989లో ఆమె రాజమండ్రి ఎంపీ స్థానానికి పోటీచేసే సమయంలోనూ యన్టీఆర్ ను విమర్శించారు. ఆ సారి గెలుపు సాధించినా, తరువాత రెండేళ్ళకే జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయినా, యన్టీఆర్, జమున మధ్య విభేదాలు ఉండేవి కావు. ఆయన ఎక్కడ కనిపించినా, ఎంతో గౌరవించేవారు. అలాగే యన్టీఆర్ సైతం జమునను గౌరవించారు. తన నిజజీవితంలో తన భర్త తరువాత యన్టీఆర్ ఒక్కరికే పాదాభివందనం చేశానని జమున పలుమార్లు చెప్పుకున్నారు.